Himanta Biswa Sarma: యూనిఫాం సివిల్ కోడ్ అమలులో భాగంగా అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం కీలక బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. ముస్లిం వివాహాలు-విడాకులను ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా నమోదు చేయాలనే బిల్లుని తీసుకువచ్చింది. ఈ బిల్లు కాజీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు బహుభార్యత్వం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయనుంది. కాంగ్రెస్ వంటి విపక్షాలు ఈ బిల్లుని విమర్శిస్తున్నప్పటికీ ఇది బాలికల అభ్యున్నతికి కీలక బిల్లు అని అస్సాం ప్రభుత్వం చెబుతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా సీఎం హిమంత బిస్వ శర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతీ శుక్రవారం రెండు గంటల పాటు నమాజ్ విరామాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ రోజు సభలో ప్రకటించారు. ఇది ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు వలస కాలం నాటి పద్ధతుల్ని తొలగించేందుకు ఒక అడుగుగా పేర్కొన్నారు. ముస్లిం చట్టసభ సభ్యులు, ఇతర సిబ్బంది శుక్రవారం ప్రార్థనలు లేదా నమాజ్ కోసం విరామం తీసుకోవడానికి అనుమతించే దీర్ఘకాలిక నిబంధనల్ని తొలగిస్తుంది.
Read Also: Abortion: గర్భం దాల్చిన 12 వారాల వరకు అబార్షన్ మాత్రలు సురక్షితం.. లాన్సెట్ స్టడీ..
ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతు ఇచ్చినందుకు అసెంబ్లీ స్పీకర్ బిస్వజిత్ డైమరీ, ఇతర శాసన సభ్యులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. జుమ్మా విరామాన్ని రద్దు చేయడం ద్వారా, అస్సాం అసెంబ్లీ పాతది అని తాను భావించే పద్ధతుల కంటే శాసనసభ ఉత్పాదకతకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన నొక్కి చెప్పారు. ఎలాంటి మతాలకు తావు లేకుండా సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
అస్సాం శాసనసభలో నమాజ్ విరామాన్ని రద్దు చేయడం అసెంబ్లీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉండే విరామాన్ని రద్దు చేశారు. ఈ నిర్ణయం అసెంబ్లీ షెడ్యూల్‌లో గణనీయమైన మార్పుల్ని సూచిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ఇప్పుడు శుక్రవారాలతో సహా ప్రతీ రోజూ ఉదయం 3.90 గంటలకు సభ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
