Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!

  • అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం..
  • ట్రక్కు - మినీ బస్సు ఢీ, 23 మంది మృతి..
Assam Accident

Assam Accident

Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాజిరంగ సమీపంలో కంటైనర్ ట్రక్కు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 23 మంది మరణించారు. మినీ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. మరణించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు సమాచారం. మరికొందరు బస్సు శిథిలాల్లో చిక్కుకున్నారు. బోకాఖాట్ నుంచి నగావ్ వైపు వెళ్తున్న మినీ బస్సును కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స కోసం కోహోరా మోడల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం జోర్హాట్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

గోలాఘాట్ ఎస్పీ స్వప్ననీల్ దేకా ప్రమాదంలో 23 మంది మరణించినట్లు ధ్రువీకరించారు. సహాయక బృందాలు బస్సు శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మినీ బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై స్పష్టత లేదని వెల్లడించారు. కాజిరంగ పార్క్ సమీపంలో వాహన వేగంపై ఉన్న ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ మినీ బస్సు అధిక వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టి ఉండొచ్చని స్వప్ననీల్ డేకా తెలిపారు. ఈ ప్రమాదంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు.