\Lakhimpur Kheri Violence Case: యూపీలోని లఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మంగళవారం నిరాకరించింది. ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితుల బెయిల్‌ను సవాలు చేస్తూ రైతు కుటుంబీకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేసింది.
అశిష్ మిశ్రా బెయిల్ కోసం మళ్లీ పిటిషన్ దాఖలు చేయడంతో కొన్నిషరతులతో బెయిల్ రావొచ్చని అందరూ భావించారు కానీ ఆ విధంగా జరగలేదు. కాగా ఆశిష్ మిశ్రా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ చతుర్వేది, బాధితుల తరఫున కమల్‌జిత్ రఖ్దా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వినోద్ షాహి హాజరయ్యారు. అంతకు ముందు ఈ అంశంపై జులై 15న విచారణ జరిగినప్పుడు కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. అయితే మంగళవారం ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసి మళ్లీ జైలుకు పంపింది. ఆశిష్ మిశ్రా ప్రస్తుతానికి జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఆశిష్ మిశ్రా తరపు న్యాయవాదులు బెయిల్ పొందేందుకు శాయశక్తులా ప్రయత్నించినా కోర్టు అతని వాదనలు ఫలించలేదు.
2021 అక్టోబర్ 3వ తేదీన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీలోని టికోనియాలో రైతుల బృందం నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పర్యటనలో నిరసన చేస్తున్న రైతులపైకి ఆయన కొడుకు ఆశిశ్ మిశ్రా కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర మంత్రి కొడుకు ఆశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. రైతులు, విపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడితో కేంద్రం.. ఈ ఘటనపై సిట్ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Parliament Monsoon Session: రాజ్యసభ నుంచి 19 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్
ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నలుగురు రైతులతో పాటు ఘర్షణలో మరో నలుగురు మృతి చెందడంతో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రాకేష్ కుమార్ జైన్‌ను నియమించింది. ఇదే కేసుపై ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్‌ను యూపీ సర్కారు పునర్నిర్మించింది. ఆ ఘటనలో మొత్తం 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సైతం వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును త్వరగా విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.