Site icon NTV Telugu

Asaduddin Owaisi: హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం వల్లే బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వరసగా గెలుస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇందుకు ప్రతిపక్షాల వైఫల్యం కూడా కారణమవుతుందని చెప్పారు. బీజేపీకి ఎంఐఎం బీ-టీమ్ అవునా..? అని ప్రశ్నించిన సమయంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తరుచుగా ప్రతిపక్షాలు ఎంఐఎంపై చేసే ఈ ఆరోపణలపై ఓవైసీ స్పందిస్తూ.. ఇది తనను నిందించడానికి, ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన పార్టీ పట్ల ప్రతిపక్షాల ద్వేషం తప్ప మరొకటి కాదని అన్నారు.

Read Also: CM Revanth Reddy: అసలైన కారణాలు ఏంటి? అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశాలు..

ప్రతిపక్ష వైఫల్యాల వల్ల బీజేపీ అధికారంలోకి వస్తుందని, దాదాపుగా 50 శాతం హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పారు. ‘‘మీరు నాపై ఎలా నిందలు వేస్తారు..? 2024 లోక్‌సభ ఎన్నికల్లో నేను హైదరాబాద్, ఔరంగాబాద్, కిషన్ గంజ్, మరికొన్ని స్థానాల్లో పోటీ చేస్తే, బీజేపీ 240 సీట్లు గెలిస్తే, నేను బాధ్యత వహిస్తానా..?’’ అని ఆయన అడిగారు.

ప్రతిపక్ష పార్టీలు ముస్లిం ఓట్లను తేలికగా తీసుకుంటున్నాయని మరియు వారి నిజమైన ఆందోళనలను పెద్దగా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతీ వర్గానికి రాజకీయ నాయకత్వం కొరుకుంటున్న వారు, ముస్లింలకు మాత్రం ఉండకూడదని అనుకుంటున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. ముస్లింలు దాదాపుగా 15 శాతం ఉంటే, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం 4 శాతం మాత్రమే అని చెప్పారు. ‘‘రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూడటం మానేసి, వారికి విద్యను అందించడానికి, వారికి న్యాయంగా వ్యవహరించడానికి మరియు వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి కృషి చేయాలి.’’ అని కోరారు.

Exit mobile version