NTV Telugu Site icon

Asaduddin Owaisi: మహారాష్ట్ర రాజకీయం “కోతుల డ్యాన్స్”లా ఉంది.

Asaduddin Owaisi

Asaduddin Owaisi

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి కూటమి ‘ మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శివసేనలో అసమ్మతి తలెత్తడం, ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చి ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ వేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్ధేశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజకీయంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం రాజకీయ సంక్షోభంపై చర్చించనివ్వండి అని.. నాటకాన్ని తాము చూస్తూనే ఉన్నామని అన్నారు. మహారాష్ట్రలో రాజకీయం ‘కోతుల నాట్యం’లా ఉందని అన్నారు. ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి దూకే కోతుల్లాగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఎంఐఎంకు తెలంగాణ తర్వాత ఎక్కువ పట్టున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇటీవల కాలంలో అక్కడ ఎన్నికల్లో పలు స్థానాలను గెలుస్తూ వస్తోంది. రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ తరువాత ఔరంగాబాద్ నియోజవర్గం నుంచే ఎంఐఎంకు ఎంపీ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఔరంగాబాద్ నుంచి ఎంఐఎం తరుపున ఇంతియాజ్ జలీల్ గెలుపొందారు. దీంతో పాటు అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో  దూలే సిటీ, మాలేగావ్ సెంట్రల్ నియోజక వర్గాలను గెలుచుకుంది ఎంఐఎం. దీంతో పాటు ఔరంగాబాద్, అమరావతి, సోలాపూర్, మాలేగావ్, ధూలే, ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాల్లో  ఎంఐఎంకు పట్టు ఉంది.