ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ గెలుపుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సమాజ్ వాదీ పార్టీని నిందించారు. యూపీలో బీజేపీ గెలుపుకు కారణం ఎవరని ప్రశ్నించారు. తాజాగా నిన్న జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో రాంపూర్, ఆజాంగఢ్ లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే సమాజ్ వాదీ పార్టీ, బీజేపీని ఓడించలేదని.. వారికి నిజాయితీ లేదని విమర్శించారు. ఇటాంటి అసమర్థ పార్టీలకు మైనార్టీ కమ్యూనిటీ ఓట్లు వేయకూడదని ఆయన అన్నారు. బీజేపీ గెలుపుకు ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారని.. ఇప్పుడు ఎవరికి బీ- టీమ్, సీ-టీమ్ అని పేరు పెడతారని అఖిలేష్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీని ప్రశ్నించారు.
ఎస్పీ, బీజేపీ పార్టీని ఓడించలేదని అసమర్థతను తెలియజేస్తుందని అసద్ విమర్శించారు. ఈ రెండు లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయానికి అఖిలేష్ యాదవ్ కారణం అని ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ కు చాలా అహంకారం ఉందని.. అతను ప్రజలను కూడా కలవరని విమర్శించారు. దేశంలో ముస్లిలు తమ సొంత రాజకీయ గుర్తింపు ఏర్పరుచుకోవాలని ఆయన కోరారు.
ఎస్పీ పార్టీకి కంచుకోటలుగా ఉన్న రాంపూర్, ఆజాంగఢ్ లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. గతంలో ఆజాంగఢ్ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్, రాంపూర్ నుంచి మరో కీలక నేత ఆజాంఖాన్ ఎంపీలు గా ఉన్నారు. అయితే ఇటీవల యూపీ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆ రెండు స్థానాలను వదులుకోవడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యాం లోధీ, ఆజాంగఢ్ నుంచి దినేష్ లాల్ యాదవ్ నిరాహువా విజయం సాధించారు.
ఆజాంగఢ్, రాంపూర్ ఉప ఎన్నికల విజయాలు చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది కేంద్రం, ఉత్తరప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాలకు విస్తృత స్థాయి ఆమోదం, మద్దతును సూచిస్తుందని ప్రధాని మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. మద్దతిచ్చిన ప్రజలకు ప్రధాన మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు ఓ సందేశాన్ని పంపాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.