NTV Telugu Site icon

Arvind Kejriwal: రాహుల్ గాంధీకే కాదు, కేజ్రీవాల్‌కి కూడా పాకిస్తాన్ నుంచి మద్దతు..బీజేపీ ఫైర్

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఇటీవల భారత రాజకీయాలపై పాకిస్తాన్ మాజీ మంత్రి, మాజీ పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడిగా పేరున్న చౌదరి ఫవాద్ హుస్సేన్ స్పందిస్తున్నారు. ఇటీవల పలు సందర్బాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మద్దతు పలికారు. తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఆరో విడతలో భాగంగా ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు వేసిన తర్వాత ఎక్స్ వేదికగా ‘‘నేను ఈ రోజు నా తండ్రి, భార్య పిల్లలతో ఓటేశారు. నా తల్లి చాలా అనారోగ్యంతో ఉండి రాలేకపోయారు. నేను ద్రవ్యోల్భణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఓటేశాను’’ అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై పాకిస్తాన్ నాయకుడు ఫవాద్ హుస్సేన్ చౌదరీ రీట్వీట్ చేస్తూ..‘‘శాంతి మరియు సామరస్యం ద్వేషం మరియు తీవ్రవాద శక్తులను ఓడించాలి’’ అని చెప్పాడు.

Read Also: Harish Rao: మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 100శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కాలి..

దీనిపై కేజ్రీవాల్ ఫవాద్‌కి కౌంటర్ ఇస్తూ.. ‘‘భారతదేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకునే బదులు ఫవాద్ హుస్సేన్ తన దేశం పరిస్థితిపై దృష్టిపెట్టాలి. మా సమస్యలను పరిష్కరించడంలో మాకు పూర్తి సామర్థ్యం ఉంది. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది, కాబట్టి మీరు మీ దేశాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నికలు మా అంతర్గత విషయం. ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్‌ల జోక్యాన్ని భారత్ సహించదు’’ అని అన్నారు.

అయితే, ఈ వివాదంపై మరోసారి బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్‌కి పాకిస్తాన్ నుంచి భారీ మద్దతు ఉందని అన్నారు. రాహుల్ గాంధీకి మాత్రమే కాకుండా అరవింద్ కేజ్రీవాల్‌కి కూడా పాకిస్తాన్ నుంచి భారీ మద్దతు లభించిందని ఎద్దేవా చేశారు.