Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ ముందు విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కి ఇప్పటికీ 5 సార్లు సమన్లు పంపింది, అయితే వీటన్నింటికి కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. దీంతో ఈడీ ఢిల్లీ రోస్ ఎవెన్యూకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు ఈరోజు.. సీఎం కేజ్రీవాల్ ఈడీ 5 సమన్లను ఎందుకు దాటవేశారనే దానిపై ఫిబ్రవరి 17న వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Read Also: James Cameron: రాజమౌళిపై అవతార్ డైరెక్టర్ ప్రశంసలు.. ఇది కదరా అసలైన కిక్కు అంటే
ఈడీ గత వారం సమన్లకు హాజరుకాకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. అయితే, తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఈడీ వేధిస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ఆదేశాల మేరకే దర్యాప్తు ఏజెన్సీ పనిచేస్తుందని, తనకు ఈడీ పంపిన నోటీసులు చట్టవిరుద్ధమని ఆయన ఆరోపిస్తున్నారు. తనను జైలులో పెట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈడీ చర్యలు ‘రాజకీయ ప్రేరేపితం’ అని, ప్రధాని మోడీ ఏకైక లక్ష్యం తనను అరెస్ట్ చేసి, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే అని నిందించారు.
ఇదిలా ఉంటే ఈ కేసును ఈడీ, సీబీఐ రెండు దర్యాప్తు ఏజెన్సీలు విచారిస్తున్నాయి. ఇప్పటికే, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలైన సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ విచారించి, ఆ తర్వాత అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరంతా జైలులో ఉన్నారు.
