Arvind Kejriwal said BJP is cheating on Uniform Civil Code: గుజరాత్ ప్రభుత్వం ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్ పై కమిటీని ఏర్పాటు చేస్తూ గుజరాత్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసేందుకు సిద్ధం అయింది. ఇదిలా ఉంటే బీజేపీ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో భాగంగానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని.. ఎన్నికల తర్వాత యూనిఫాం సివిల్ కోడ్ పై ఎలాంటి చర్యలు ఉండవని విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. యూనిఫాం సివిల్ కోడ్ కావాలి కానీ.. ఇది బీజేపీ ఎన్నికల స్టంట్ మాత్రమే అని, బీజేపీ బ్లఫింగ్ చేస్తోందని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మరోవైపు హిందువుల మెజారిటీ ఓట్లను చీల్చేందుకు చేసిన జిమ్మిక్కుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.
Read Also: Madhu Yashki : రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ ఇచ్చిన కాంట్రాక్ట్ వివరాలు ఇవే…
బీజేపీ నేతృత్వంలో గుజరాత్ ప్రభుత్వంపై కేజ్రీవాల్ అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ లో కూడా బీజేపీ ఇలాగే హామీ ఇచ్చిందని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత దానిని అమలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఎన్నికల అనంతరం ఇంటికి వెళ్తుందని ఆయన అన్నారు.
గుజరాత్ లోని భావ్ నగర్ లో మాట్లాడిని కేజ్రీవాల్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 యూనిఫాం సివిల్ కోడ్ ను రూపొందించాలని అది ప్రభుత్వ బాధ్యత అని స్పష్టంగా చెబుతోందని.. అయితే అది ప్రభుత్వ అనుమతితో, అన్ని సంఘాల సంప్రదింపులతో జరగాలని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని.. దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని.. లోక్ సభ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారా..? అని ప్రశ్నించారు. ముస్లింలకు వివాదాస్పద అంశం, మత ఆధారిత చట్టాలను తొలగించే యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.