Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సరికొత్త వివాదం
  • ఆర్ఎస్ఎస్ జడ్జ్‌ల ముందు హాజరుకాను
  • జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
Kejriwal

Kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సరికొత్త వివాదానికి దారి తీస్తోంది. ఫిబ్రవరి 27న లిక్కర్ స్కామ్ కేసును ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.

అయితే ఈ కేసు జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్‌కు వెళ్లింది. అయితే జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి ఉన్నారని.. బీజేపీ అనుబంధ సమావేశాల్లో పాల్గొన్నారని.. ఇలాగైతే తమకు న్యాయం జరగదని.. తన కేసు నుంచి స్వర్ణకాంత శర్మను తప్పించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్‌ను ఇటీవల న్యాయస్థానం కొట్టేసింది.

తాజాగా జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కేజ్రీవాల్ లేఖ రాశారు. వ్యక్తిగతంగా గానీ న్యాయవాది ద్వారా గానీ ఆమె ఎదుట హాజరుకాబోనని లేఖలో పేర్కొన్నారు. ‘‘జస్టిస్ స్వర్ణకాంత నుంచి న్యాయం లభిస్తుందన్న నా ఆశలు ఆవిరయ్యాయి. అందువల్ల నేను గాంధీజీ సత్యాగ్రహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. నా మనస్సాక్షి ఆధారంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు ఇస్తే.. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే హక్కును నేను కలిగి ఉంటాను.’’ అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.

2024లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేసింది. అనంతరం 2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. అనూహ్యంగా ఈ కేసును గత ఫిబ్రవరి 27, 2026న ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్నారు. ఆమె ఆర్ఎస్ఎస్ సానుభూతిపరురాలని.. అలాగైతే ఈ కేసులో తమకు న్యాయం జరగదని.. విచారణ నుంచి తప్పించాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 20న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. తాజాగా ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాబోనని తేల్చి చెబుతూ కేజ్రీవాల్ లేఖ రాశారు.