Site icon NTV Telugu

Arvind Kejriwal: ‘ఆపరేషన్ కమలం’.. అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు పంజాబ్..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: పంజాబ్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్‌లో ఆప్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను బద్దలు కొడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ‘ఆపరేషన్ కమలం’ను బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రేరేపిస్తోందని కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. ఢిల్లీలో విఫలమైన బీజేపీ పంజాబ్‌పై దృష్టి సారించిందని ఆ పార్టీ పేర్కొంది.

పెద్ద నేతలను కలవడానికి ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీకి రమ్మని అడిగారని, పార్టీ మారేందుకు కోట్లకు కోట్లు ఆఫర్ చేశారని పంజాబ్ మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు.”ఢిల్లీకి రండి, బీజేపీ అగ్రనేతలు మిమ్మల్ని కలుస్తారు” అని పార్టీ ఎమ్మెల్యేకు వచ్చిన కాల్‌లలో ఒకదాన్ని ఉదహరిస్తూ మిస్టర్ చీమా పేర్కొన్నారు. అంతేకాదు.. తమ సర్కార్‌ను పడగొట్టేందుకు బీజేపీ ఏకంగా రూ.1,375 కోట్లు ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. గతంలో గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఇలాంటి ప్లానే చేసిందని.. ఇప్పుడు పంజాబ్‌లోనూ అదే పని చేస్తోందని మండిపడ్డారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా… మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను తమకు మద్దతు ఇచ్చేలా చేసే ప్రయత్నాల్లో భాగంగా.. అందులో ఏడుగురిని నేరుగా.. లేదా మూడో వ్యక్తి ద్వారా సంప్రదించారని విమర్శించారు.. మరోవైపు.. కేంద్ర నిఘా వర్గాల ద్వారా కూడా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.

Goa CM Pramod Sawant: ‘కాంగ్రెస్ చోడో యాత్ర’ గోవా నుంచి ప్రారంభమైంది..

ఈ నెల ప్రారంభంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసిందని, జాతీయ పార్టీలో చేరడానికి కొంతమంది ఢిల్లీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు మొత్తం రూ.1,375 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైందని హర్పాల్ చీమా సంచలన ఆరోపణలు చేశారు.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆఫర్ చేశారని ఆరోపణలు గుప్పించారు. కాగా, ఢిల్లీలోనూ బీజేపీపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.. అయితే, ఆప్‌ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడ్డ ఆ పార్టీ.. అసెంబ్లీ వేదికగా బలనిరూపణ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌లోనే ఆప్‌ సర్కార్‌ను బీజేపీ టార్గెట్‌ చేస్తుందని.. ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version