Site icon NTV Telugu

Arvind Kejriwal: ప్రభుత్వాలను హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: బీజేపీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తున్న సీరియర్ కిల్లర్ బీజేపీ అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారును కూడా కూల్చేందుకు బీజేపీ యత్నించిందని, బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి లాక్కోవాలని యత్నించిందని.. కానీ ఆప్ నేతలు వారి బుట్టలో పడలేదని ఆయన అన్నారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు తాను సిద్ధమన్నారు. తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లలేదనే విషయాన్ని బల పరీక్షలో నిరూపిస్తానని తెలిపారు. ఆప్ ప్రభుత్వం సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తీసుకురానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఢిల్లీలో బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’, ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతి ఆరోపణలపై కేజ్రీ సర్కారు ఢిల్లీ అసెంబ్లీ పత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో కేజ్రీవాల్ బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఇరికించేందుకు సీబీఐ ఎంతో ప్రయత్నించిందని… ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో ఒక్క పావలాను కూడా పట్టుకోలేకపోయారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే మనీష్‌ను ఒక బీజేపీ నేత సంప్రదించారని… ఆప్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావాలని… ముఖ్యమంత్రి పదవిని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లను ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే మనీష్ ఈ ఆఫర్‌ను తిరస్కరించారని… దీంతో వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలందరూ వజ్రాలని… వారిని ఎవరూ కొనలేరని అన్నారు.

Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. ఆజాద్‌కు మద్దతుగా 5గురు నేతలు రాజీనామా

తమ 40 మంది ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని ఆప్ ఆరోపించింది. “బిజెపి అనేక ప్రభుత్వాలను కూల్చివేసింది. ఇప్పుడు వారు ఢిల్లీ వైపు మొగ్గు చూపారు. మన దేశంలో ప్రభుత్వాల వరుస హత్యలు జరుగుతున్నాయి” అని కేజ్రీవాల్ అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోపించారు. “ఇటీవలి సంవత్సరాలలో 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసింది. ఆపరేషన్ కమలం కోసం బీజేపీ రూ.5,500 కోట్లు ఖర్చు చేసింది, రూ.800 కోట్లు ఢిల్లీ కోసం ఉంచింది” అని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకి అంత డబ్బు ఎలా వచ్చిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. “ఖరీదైన చమురు, ఇంధనం, నిత్యావసరాల నుంచి వచ్చే డబ్బు అంతా ఎమ్మెల్యేల కొనుగోలుకే వినియోగిస్తున్నారు. జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను), ద్రవ్యోల్బణం నుంచి వచ్చిన డబ్బులన్నీ ఎమ్మెల్యేలను కొనడం, బిలియనీర్ స్నేహితుల రుణాలు మాఫీ చేయడం అనే రెండు పనుల కోసం వెచ్చిస్తున్నారు.” అని కేజ్రీవాల్ అన్నారు.

 

Exit mobile version