NTV Telugu Site icon

Kejriwal: జైల్లో చంపేందుకు బీజేపీ కుట్ర.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

Kejriwal

Kejriwal

తీహార్ జైల్లో తనను చంపేందుకు బీజేపీ కుట్ర చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. పార్టీ ప్రజా ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్నప్పుడు తనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు నిరాకరించారని.. సకాలంలో ఇంజెక్షన్ తీసుకోకపోతే చనిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు తీహార్ జైల్లో చంపేందుకు బీజేపీ కుట్ర చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఉచిత విద్యుత్‌ పథకం ఎత్తేస్తారన్నారు. పదేళ్లుగా ఢిల్లీ అభివృద్ధి పనులను బీజేపీ నిలిపివేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు.

ఇక తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఢిల్లీలో ప్రజల కోసం పనిచేస్తున్నందున తనను జైలుకు పంపారని తెలిపారు. తాను బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత పగిలిన రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీలు శుభ్రం చేయడం, నీటి సరఫరా నిరాంతరాయంగా ఆప్ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.

ఇక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ లేఖను ఆప్ కార్యకర్తలు అక్టోబర్ 29 వరకు 70 నియోజకవర్గాల్లోని ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. మరోసారి అధికారం కోసం ప్రణాళికలు రచిచూస్తోంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇంటికి వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిషిని ముఖ్యమంత్రిని చేశారు.