NTV Telugu Site icon

Arunachal Pradesh: 21 మందిపై లైంగిక దాడికి పాల్పడిన వార్డెన్‌కు మరణశిక్ష!

Arunachalpradesh

Arunachalpradesh

అరుణాచల్‌ప్రదేశ్‌లో 2014-2022 వరకు 21 మందిపై లైంగిక దాడికి పాల్పడిన హాస్టల్ వార్డెన్‌కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో లైంగిక దాడుల వ్యవహారం 2022లో వెలుగు చూసింది. తన 12 ఏళ్ల కవల కుమార్తెలను హాస్టల్‌ వార్డెన్‌ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ తండ్రి ఫిర్యాదు చేశాడు. మరికొందరు బాధితులు కూడా ఇటువంటి ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో వార్డెన్‌ అరాచకాలు బయటపడ్డాయి. 2014-22 మధ్యకాలంలో 21 మంది మైనర్లపై అతడు లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్లు తేలింది. బాగ్రా హాస్టల్ వార్డెన్‌గా ఉన్న సమయంలో 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ఆరుగురు బాలురుతో సహా కనీసం 21 మంది మైనర్‌లపై దాడి చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది.

గతేడాది జులైలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. లైంగిక దాడికి పాల్పడేముందు బాధితులకు వార్డెన్‌ మత్తుమందు ఇచ్చేవాడని తేలింది. ఈ విషయాలు బయటకు చెప్పకూడదని బెదిరింపులకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆరుగురు బాధితులు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారని తేలింది. వార్డెన్‌ ఆగడాల గురించి ఓ మహిళా టీచర్‌కు బాధిత చిన్నారులు చెప్పినప్పటికీ.. పై అధికారుల దృష్టికి ఆమె తీసుకెళ్లలేదని దర్యాప్తులో వెల్లడైంది. విచారణ జరిపిన పోక్సో న్యాయస్థానం వార్డెన్‌కు మరణశిక్ష విధించగా.. మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో మహిళా టీచర్‌కు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.