Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే ‘‘మహా కుంభ మేళ’’కి యోగీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. మన దేశం నుంచే కాకుండా సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న చాలా మంది విదేశీయులు కుంభ మేళకు రాబోతున్నారు.
ఈ జాబితాలో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ దివంతగ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ కూడా చేరారు. పావెల్ 2025 మహా కుంభమేళకు హాజరు అవుతారని స్వామి కైలాష్నంద్ జీ మహరాజ్ బుధవారం ధ్రువీకరించారు. లారెన్ పావెల్‌కి ‘‘కమల’’ అనే హిందూ పేరు పెట్టినట్లు చెప్పారు. “ఆమె ఇక్కడ తన గురువును సందర్శించడానికి వస్తోంది. మేము ఆమెకు కమలా అని పేరు పెట్టాము, ఆమె మాకు కుమార్తె లాంటిది. ఆమె భారతదేశానికి రావడం ఇది రెండవసారి… కుంభమేళాలో అందరికీ స్వాగతం” అని ఆయన అన్నారు. ఆమె ధ్యానం చేయడానికి ఇక్కడి వస్తుందని చెప్పారు.
Read Also: Giorgia Meloni: ‘‘జార్జ్ సొరోస్’’పై ఇటలీ ప్రధాని ఫైర్.. మస్క్, బీజేపీ ఆరోపణలకు మద్దతు..
పావెల్ అఖడా పెషావై చేరుతారా?? అని అడిగిన సమయంలో ఆమెను చేర్చడానికి ప్రయత్నిస్తాము, ఆమె నిర్ణయం ఆమెకే వదిలేస్తామని చెప్పారు. ఆమె కుంభ్‌లో పర్యటించి ఇక్కడి సాధువులను కలుస్తారని, ఆమె మంచి అనుభూతి పొందుతారని, మన సంప్రదాయాల గురించి పెద్దగా తెలియని వారు నేర్చుకోవాలనుకునే మంచి అనుభూతి మనకు కలుగుతుందని ఆయన చెప్పారు.
12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభ మేళకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. భక్తులు గంగా, యమునా, సరస్వతి నదులు సంగమమైన ప్రయాగ్‌రాజ్‌లో స్నానాలు ఆచరించడానికి వస్తారు. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26తో ముగుస్తుంది.