Site icon NTV Telugu

UP: మాజీ సీఎం సోదరుడు షాకింగ్ ప్రకటన.. భార్యతో విడిపోతున్నట్లు పోస్ట్

Up

Up

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో షాకింగ్ పరిణామం జరిగింది. ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలోని వివాదం రచ్చ చేస్తోంది. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన ప్రకటన చేశాడు. తన భార్య అపర్ణ యాదవ్ నుంచి విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వార్త ఇప్పుడు యూపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

వీలైనంత త్వరగా భార్యతో విడిపోవాలని అనుకుంటున్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతీక్ యాదవ్ రాసుకొచ్చాడు. తన భార్య కుటుంబ సంబంధాలను నాశనం చేస్తోందని.. సొంత కీర్తి, ప్రభావాన్ని పెంచుకోవడం కోసం ప్రాకులాడుతోందని తీవ్ర ఆరోపణలు చేశాడు. తన భార్య ఎప్పుడూ పట్టించుకోలేదని.. ప్రస్తుతం తాను మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఇంత స్వార్థపూరిత ఆలోచనను తాను ఎప్పుడూ చూడలేదని.. వివాహం పట్ల చింతిస్తున్నట్లుగా వాపోయాడు.

అయితే భర్త ప్రతీక్ యాదవ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై భార్య అపర్ణ యాదవ్ ఇంకా స్పందించలేదు. దీనిపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సస్పెన్ష్‌గా ఉంది.

ప్రతీక్ యాదవ్-అపర్ణ యాదవ్‌కు 2011లో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. ప్రతీక్ యాదవ్ ములాయం చిన్న కుమారుడు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు. ఇక భార్య అపర్ణ యాదవ్.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. అనంతరం 2022లో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో సీఎం యోగి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకుంది. అటు తర్వాత ఆయోధ్య రామాలయం కోసం రూ.11లక్షలు విరాళం ఇచ్చింది. అయితే బీజేపీలో చేరిన దగ్గర నుంచి ములాయం కుటుంబంలో విభేదాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. సొంత ఇమేజ్ కోసం ఆమె ప్రాకులాడినట్లుగా సమాచారం. ఈ కారణంతోనే విభేదాలు తలెత్తి విడాకుల దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

Exit mobile version