NTV Telugu Site icon

Kota: ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. తనవు చాలించిన మైనర్ బాలిక..

Kota

Kota

Kota: మెదడుకు ఎక్కని చదువులు, తీవ్ర ఒత్తిడి, ఎక్కడ తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చలేమో అనే భయం ఇలా నీట్ విద్యార్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా రెండు పదులు నిండని వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎడ్యుకేషనల్ హబ్ గా పేరున్న రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో మైనర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

కోటాలోని విజ్ఞాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న మైనర్ బాలిక ప్రియాస్ సింగ్(16) విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. గత రెండు వారాల్లో ఇది రెండో సంఘటన. మొత్తంగా ఈ ఏడాది 26 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐతే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రియాస్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ లోని మౌ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బాలిక విషం తాగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ భగవత్ సింగ్ హింగర్ తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Read Also: Hardeep Singh Nijjar: హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు..? ఇతని హత్య ఇండియా-కెనడాల మధ్య ఎందుకు చిచ్చు పెట్టింది..?

ప్రతిష్టాత్మక నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కోసం సిద్ధమయ్యేందుకు ఏటా దేశ నలుమూలల నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు రాజస్థాన్ కోటాకు వస్తుంటారు. నీట్ తో పాటు జేఈఈ శిక్షణ కోసం విద్యార్థులు ఇక్కడి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటారు. అయితే మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక విద్యార్థులు హాస్టళ్లలో ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అక్కడి హాస్టళ్లలో బాల్కనీలకు గ్రిల్స్, సీలింగ్ ఫ్యాన్లకు స్ప్రింగ్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయినా కూడా ఆత్మహత్యలు ఆగడం లేదు.