Cheetah Died: చీతాల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూనో పార్కులో మరో చీతా మృతి చెందింది. గడచిన నాలుగు నెలల్లో ఇది 8వ ఘటన కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని కూనో జాతీయ పార్కు లో తాజాగా మరో చీతా మరణించింది. శుక్రవారం ఉదయం ఆఫ్రికన్ చిరుత సూరజ్ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. చీతా మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల్లోనే ఇది రెండో మరణం కాగా.. నాలుగు నెలల్లో ఎనిమిదో ఘటన.
Read also: CS Shanti Kumari : డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరం
దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏడాది సెప్టెంబర్‌లో 8 చీతాలను ఆఫ్రికాలోని నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో ఉంచారు. రెండో దశలో ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 12 చీతాలను కునో నేషనల్ పార్క్‌కు తరలించారు. మొత్తం 20 చీతాల్లో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది చీతాలు మరణించాయి. మార్చి 27వ తేదీన సాషా అనే ఆడ చీతా మూత్రపిండ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత.. నెల తిరగకుండానే ఏప్రిల్ 23న కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్‌తో ఉదయ్ అనే చీతా మరణించింది. ఆ తర్వాత 20 రోజులకే మే 9న దక్ష అనే ఆడ చీత మృతి చెందింది. అదే నెలలో మూడు కూన పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. ఆ తర్వాత జులై 11వ తేదీన తేజస్ అనే మగ చీతా గాయాల కారణంగా మరణించింది. తాజాగా ఇప్పుడు సూరజ్ ప్రాణాలు కోల్పోయింది. దీంతో గడచిన నాలులు నెలల్లోనే 8వ ఘటన జరగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. మగ చీతా సూరజ్ మృతికిగల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.