NTV Telugu Site icon

Amritpal Singh: ఐదు వాహనాలు మార్చి.. గన్ పాయింట్‌లో బైక్ చోరీ.. తప్పించుకున్న ఖలిస్తానీ లీడర్

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం ఆరో రోజు పంజాబ్ పోలీసులు వేట సాగిస్తున్నారు. గత ఐదు రోజులుగా పంజాబ్ అంతటా గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే అమృత్ పాల్ సింగ్ పోలీసులు, కేంద్ర బలగాల కళ్లుకప్పి పారిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తం 5 వాహనాలను మారుస్తూ అతడు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గత శనివారం నుంచి అమృత్ పాల్ సింగ్ మామతో సహా 120 మందిని అరెస్ట్ చేశారు.

Read Also: Modi Surname Case: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు..

ఈ ఆపరేషన్ కు రోజున బలంధర్ లోని షాకోట్ ప్రాంతంలో మారుతి బ్రెజ్జా కారులోకి మారాడు. అంతకుముందు మెర్సిడెస్ ఎస్యూవీ కారులో అమృత్ పాల్ సింగ్ కనిపించాడు. కారులోనే తన బట్టలను మార్చుకున్నట్లు సీసీ పుటేజీల్లో తేలింది. నంగల్ అంబియార్ ప్రాంతంలో బ్రెజ్జా నుంచి అతడి అనుచరుడితో పప్పల్ ప్రీత్ సింగ్ తో కలసి బజాజ్ ప్లాటినా బైకుపై కనిపించాడు. బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో దారాపూర్ లో త్రీవీలర్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ తరువాత అమృత్ పాల్ సింగ్, పప్పల్ ప్రీత్ తుపాకీతో బెదిరించి ఓ బైకును దొంగిలించారు. మార్చి 18న సాయంత్రం 6.46 గంటల ప్రాంతంలో లూథియానాలోని షేక్ పూర్ లో దొంగిలించిన బైక్ పై ఇద్దరు వ్యక్తులు పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. మెర్సిడెస్ ఎస్‌యూవీ, మారుతీ బ్రీజా మరియు బజాజ్ ప్లాటినాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 120 మందిని అరెస్ట్ చేయగా.. వారిలో నలుగురిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసి అస్సాంలోని దిబ్రూగడ్ సెంట్రల్ జైలుకు తరలించారు.

Show comments