Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తన అనుచరుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన అమితాబ్‌ను టార్గెట్ చేసే ప్లాన్ ఆగదని ధిల్లాన్ సోషల్ మీడియా పోస్టులో హెచ్చరించారు. ముంబైలో తనకు చెందిన 200 మంది అనుచరులు సిద్ధంగా ఉన్నారని బెదిరించాడు. సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని వదిలిపెట్టబోయేది లేదని హెచ్చరించారు. అమితాబ్, అభిషేక్‌కు ఎంత భద్రత ఉన్నా, బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేసుకున్నా కాల్చి చంపుతామని బెదిరించాడు.
ఇదిలా ఉంటే, కొద్దిరోజుల క్రితం ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. అమితాబ్ బచ్చన్ ముంబై నివాసం వద్ద కాల్పులు జరిపేందుకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కుట్రలో వీరి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టైన వారిలో వికాస్ ఠాకూర్ అలియాస్ విక్కీ, దీపక్ సింగ్ అలియాస్ దీప్ ఉన్నారు. వీరిద్దరూ పంజాబ్‌లోని జలంధర్, తరన్ తరన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
తాజా బెదిరింపు పోస్టులో గోల్డీ ధిల్లాన్ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ హింసకు బాధ్యులైన వారిని ఎప్పటికీ క్షమించబోమని పేర్కొన్నట్లు సమాచారం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సిక్కు సమాజానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారిని బాధ్యులుగా నిలబెడుతామని ధిల్లాన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమితాబ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

