Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం రాదు..

  • రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా..
  • రాహుల్ విదేశాల్లో భారత ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని ఆరోపణలు..
  • ఇలాగే ఉంటే మరో 30 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాదన్న షా..
Amit Shah Rahul

Amit Shah Rahul

Amit Shah: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను అప్రతిష్టపాలు చేసేలా రాహుల్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇదే వైఖరి కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ రాబోయే 30 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఆదివారం పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా కాంగ్రెస్ వరస రాజకీయ పరాజయాలను ఎదుర్కొంటోందని, ఆ నిరాశతోనే ఆ పార్టీ నేతలు వివిధ రూపాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ గెలవాలనుకుంటే విదేశాలకు వెళ్లి భారత్‌పై విమర్శలు చేయడం మానుకోవాలని అమిత్ షా సూచిచారు. దేశంలోని గ్రామాలకు వెళ్లి ప్రజల్ని కలవాలని, వారి సమస్యల్ని తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రధాని నరేంద్రమోడీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తుండగా, రాహుల్ గాంధీ అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రాబోయే ఎన్నికల్లో భారత ప్రజాస్వామ్యాన్ని, ప్రధానిని, దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. రాహుల్ గాంధీ ఇదే పద్ధతిని కొనసాగిస్తే కాంగ్రెస్ మరో 30 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. రాహుల్ రాజకీయాల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా అమిత్ షా విమర్శించారు.