NTV Telugu Site icon

Amit Shah: మహ్మద్ అలీ జిన్నా గ్రేట్.. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్..

Amit Shah

Amit Shah

Amit Shah: గతంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా ‘గ్రేట్’ అంటూ గతంలో అఖిలేష్ వ్యాఖ్యానించిన విషయాన్ని షా గుర్తు చేశారు. హర్దోయ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా మాట్లాడుతూ.. 2021లో సర్దా్ర్ వల్లభబాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సందర్భంగా యూపీ మాజీ సీఎం జిన్నా గొప్ప నాయకుడంటూ చెప్పారని అన్నారు.

‘‘ అఖిలేష్ యాదవ్ చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే భారత దేశ విభజనకు కారణం జిన్నా. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే అఖిలేష్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి వారికి ఓటేయాలా..?’’ అని అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతీ వేసవిలో విశ్రాంతి తీసుకునేందుకు విదేశాలకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఎండలు పెరిగినప్పుడు రాహుల్ బాబా థాయ్‌లాండ్ వెళ్తారు, కానీ ప్రధాని మోడీ 23 ఏళ్లుగా విరామం తీసుకోలేదని చెప్పారు.

Read Also: PM Modi: శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్.. డీఎంకేకి కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకునే దమ్ముందా..?

ఇండియా కూటమి మొత్తం అవినీతి విలువ రూ. 12లక్షల కోట్లని, 23 ఏళ్లుగా ఏ చిన్న అవినీతి కూడా ప్రధాని మోడీ చేయలేదని చెప్పారు. జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి తన ఇంట్లో రూ. 30 కోట్లు, ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో రూ. 350 కోట్లు, మమతా బెనర్జీ ప్రభుత్వంలో మాజీ మంత్రి వద్ద రూ. 50 కోట్లు పట్టుబడ్డాయని అమిత్ షా చెప్పారు. రాహుల్ బాబా అమేథీ నుంచి వయనాడ్, వయనాడ్ నుంచి రాయ్‌బరేలీ వచ్చారు, రాయ్‌బరేలీ నుంచి నేరుగా ఇటలీ వెళ్తారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ మొదటి మూడు దశల్లోనే ఎన్డీయే కూటమి 190 సీట్లను అధిగమించిందని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపపోతాయని అన్నారు. రాహుల్ గాంధీ పాకిస్తాన్ ఎజెండాను మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారని, అందుకే పొరుగు దేశం అతడిని ప్రశంసిస్తుందని ఆరోపించారు.