Site icon NTV Telugu

Amit Shah: జమ్మూకశ్మీర్‌లో కీలక ప్రకటన.. ఆ వర్గానికి కోటా

Amit Shah Jk Tour

Amit Shah Jk Tour

Amit Shah Announced A Quota To Gujjar Bakarwal Pahari Communities In Jammu Kashmir: తన జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికీ ఎస్టీ హోదా కల్పించి.. త్వరలోనే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీ కోటాలో గుజ్జర్లు, బకర్వాల్‌లు, పహారీలకు ఎలాంటి తగ్గుదల ఉండదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ వాటాను పొందుతారని వెల్లడించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల.. జమ్మూకశ్మీర్‌లోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమం అయ్యిందన్నారు.

ఇదే సమయంలో అమిత్ షా జమ్మూకశ్మీర్‌లోని విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఇక్కడ కేవలం మూడు రాజకీయ కుటుంబాలే పాలించేవని మండిపడ్డారు. కానీ ఇప్పుడు పంచాయతీలు, కౌన్సిల్‌లకు.. న్యాయమైన ఎన్నికల ద్వారా ఎన్నికైన 30 వేల మంది వ్యక్తుల వద్ద అధికారం ఉందని చెప్పారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఇంతకుముందు కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని, అయితే ఆ డబ్బంతా కొందరే దోచుకున్నారని ఆరోపణలు చేశారు. కానీ.. ఇప్పుడు కేవలం ప్రజల సంక్షేమం కోసం ఆ నిధులు ఖర్చు అవుతున్నాయన్నారు. ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు ప్రధాని మోదీ పటిష్టమైన చర్యలు తీసుకున్నారని.. దాంతో భద్రతా సిబ్బంది మరణాల సంఖ్య చాలా తగ్గిందన్నారు. గతంలో ఏడాదికి 1200 మంది ప్రాణాలు కోల్పేతే.. ఇప్పుడా సంఖ్య 136కి తగ్గిందని పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. చట్టపరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత, రిజర్వేషన్ ప్రయోజనాలను జమ్మూకశ్మీర్‌లోని ఆయా వర్గాల ప్రజలు పొందుతారు. అయితే.. పహారీలకు ఎస్టీ హోదా కార్యరూపం దాల్చాలంటే, కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్‌లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఒకవేళ అది మంజూరైతే మాత్రం, ఒక భాష మాట్లాడే సమూహానికి రిజర్వేషన్లు కల్పించడం.. దేశంలోనే మొదటిసారి అవుతుంది.

Exit mobile version