Railways: ఇటీవల కాలం రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ కావడంతో వారంతా స్లీపర్, ఏసీ కోచ్‌లలోకి ప్రయాణిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. వందేభారత్ రైళ్లపై దృష్టిపెట్టిన కేంద్రం, సామాన్యుడు ప్రయాణించే రైళ్లను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల మధ్య నడిచే ముఖ్యమైన 46 రైళ్లలో 92 కొత్త జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కోచ్‌ల సంఖ్య పెంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
బెంగుళూరు సిటీ బెలగావి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ హుబ్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ముంబై బెంగళూరు ఉదయన్ ఎక్స్‌ప్రెస్, ముంబై అమరావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గౌహతి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్, గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరో 22 రైళ్లను కూడా గుర్తించామని, వాటిలో కూడా త్వరలోన అదనపు జనరల్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Anant ambani wedding: రాధిక గురించి అత్తగారు నీతా మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్
పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని 2024-24, 2025-26లో మరో 10,000 నాన్-ఏసీ కోచ్‌లను తయారు చేసే ప్రణాళికను రూపొందించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2024-25) నాన్-ఎసి కోచ్‌లను మరియు 2025-26లో మరో 5444 కోచ్‌ల ఉత్పత్తిని పెంచే యోచనను రైల్వే సీనియర్ అధికారి వెల్లడించారు. దీనికి అదనంగా రైల్వే తన రోలింగ్ స్టాక్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడానికి 5300 కంటే ఎక్కువ సాధారణ కోచ్‌లను రూపొందించాలని యోచిస్తోంది. భారతీయ రైల్వే సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, భారతీయ రైల్వే 2605 జనరల్ కోచ్‌లను తయారు చేయడానికి సిద్ధంగా ఉందని, ఇందులో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి రూపొందించిన ప్రత్యేకమైన ‘‘అమృత్ భారత్’’ జనరల్ కోచ్‌లు ఉన్నాయని చెప్పుకొచ్చారు.