Site icon NTV Telugu

Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..

Tomato

Tomato

Tomato stolen: ఎప్పుడూ లేని విధంగా టమాటా రేట్లు పైపైకి వెళ్తున్నాయి. రాకెట్ వేగంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర సెంచరీని దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో ధర రూ. 150కి పైగానే పలుకుతోంది. దీంతో సామాన్యుడు టమాటా కొనలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే పెరుగుతున్న ధర నేపథ్యంలో టమాటా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో తోటలోని టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు.

వివరాల్లోకి వెళ్తే జూలై 4వ తేదీ రాత్రి హసన్ జిల్లాలోని గోని సోమనహళ్లి గ్రామంలోని రూ. 2.5 లక్షల విలువై టమాటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించాడు. బెంగళూర్ లో కిలో టమాటా రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్ తరలించాలని యోచిస్తున్న సమయంలో తన 2 ఎకరాల్లోని టమాటాలను దొంగిలించారని మహిళా రైతు ధరణి తన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: NCP Poster War: ఎన్సీపీలో పోస్టర్ వార్.. శరద్ పవార్ బాహుబలి.. అజిత్ పవార్ కట్టప్ప

శనగ పంటతో భారీ నష్టాలు చవిచూసి టమాటా సాగు చేశామని.. పంటను పండించేందుకు అప్పులు చేశానమి.. మాకు మంచి పంట చేతికొచ్చే సమయానికి దొంగలు టమాటాలను ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 50-60 బస్తాల టమాటాను తీసుకెళ్లడమే కాకుండా.. మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేసినట్లు ధరణి చెప్పారు. దీనిపై హళేబీడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఐపీసీ) సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది ఎండల తీవ్రత, రుతుపవనాలు ఆలస్యం కావడంతో టమాటా పంట దెబ్బతింది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో టమాటాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. తొలుత ఎండల తీవ్రత, వర్షాలు సకాలం కరవకపోవడంతో పాటు ఇటీవల కాలంలో భారీ వర్షాలు పంటను దెబ్బతీశాయి. దీంతో టమాటా డిమాండ్, సప్లైకి మధ్య తేడా వచ్చింది. దీంతో రేట్లు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో టమాటా రేట్లు దిగి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.

Exit mobile version