Mamata Banerjee: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్తగా ‘‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవక మిషన్ గ్రామీణ్(VB-G RAM G)’’ చట్టం, 2025ను తీసుకురావడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ పేరును ఉద్దేశపూర్వకంగా బీజేపీ తొలగిస్తోందని, గాంధీ అంటే బీజేపీకి పడదని ఆరోపిస్తున్నాయి.
Read Also: Tata Motors: టాటా డిసెంబర్ ఆఫర్.. రూ. 4,999 EMIతోనే కార్ ఇంటికి తీసుకెళ్లొచ్చు..
ఈ పేరు మార్పు వివాదం కొనసాగున్న వేళ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్రంలో అమలు చేస్తున్న ఒక పథకానికి మహాత్మా గాంధీ పేరును పెడుతున్నట్లు ప్రకటించారు. కర్మశ్రీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడానికి రాష్ట్ర క్యాబినెట్‌లో ఒక బిల్లును తీసుకువస్తుందని అన్నారు. గురువారం కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో మమత మాట్లాడుతూ.. ‘‘గాంధీజీ పేరు తొలగించడం నాకు తీవ్ర సిగ్గుచేటు. MGNREGA నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించే బిల్లును ప్రవేశపెట్టారు. మనం ఇప్పుడు జాతిపితను కూడా మర్చిపోతున్నామా?. అందుకే మేము మా కర్మశ్రీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము. మేము గౌరవం తప్ప మరేమీ కోరుకోవడం లేదు. మహాత్మా గాంధీని ఎలా గౌరవించాలో కొందరికి తెలియకపోతే, నిజమైన గౌరవం అంటే ఏమిటో మేము చూపిస్తాము.’’ అని అన్నారు.
దీనికి కౌంటర్ గా పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ మరియు రాజ్యసభ ఎంపీ సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘‘తృణమూల్ కాంగ్రెస్ పాలనలో కూడా గతంలో గాంధీజీకి గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూ కేంద్ర నిధుల నుండి డబ్బును దోచుకున్నారు. గాంధీకి రాముడంటే చాలా ఇష్టం. గాంధీజీకి సరైన గౌరవం ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీనే. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాల వల్ల గాంధీ కలలు నిజమయ్యాయి’’ అని అన్నారు.