Site icon NTV Telugu

Anant Ambani-Radhika wedding: 50 జంటలకు సామూహిక వివాహాలు.. భారీ కానుకలు

Marriege

Marriege

ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలంటే మామూలుగా ఉంటాయి. అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. మార్చి 1 నుంచి 3 వరకు చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక త్వరలోనే ఈ జంట మూడు ముళ్లతో ఒక్కటి కాబోతుంది. దీన్ని పురస్కరించుకుని ముకేష్ అంబానీ దంపతులు 50 పేద జంటలకు మంగళవారం సామూహిక వివాహాలు జరిపించారు. అంతేకాకుండా ఎంతో ఖరీదైన బహుమానాలు కూడా అందజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ముంబై సమీపంలోని రిలయన్స్‌ కార్పొరేట్ పార్క్‌ సామూహిక వివాహాలకు వేదికైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్‌, కోడలు శ్లోక, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్‌ హాజరయ్యారు. కొత్త జంటల తరఫున బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోలాహలంగా కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా కొత్త జంటలకు భారీగా కానుకలను అత్త నీతా అంబానీ, కోడలు అందజేశారు. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెకు రూ.1.01 లక్షల చెక్‌ అందించారు. అంతేగాకుండా ఒక ఏడాదికి సరిపడా సరకులు అందజేశారు. గ్యాస్‌ స్టవ్, మిక్సీ, ఫ్యాన్‌, పరుపులు, దిండ్లు, గిన్నెలు అందించారు. అతిథులందరికి భారీ విందు ఏర్పాటు చేశారు. నూతన దంపతులు ముకేష్-నీతా దగ్గర ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే రాధికతో అనంత్‌ అంబానీ వివాహం జులై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనుంది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి.

 

 

 

 

 

Exit mobile version