NTV Telugu Site icon

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Amaranath Yatra

Amaranath Yatra

Amarnath Yatra : భారీ వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా శనివారం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గత రాత్రి నుంచి బల్తాల్, పహల్గాం మార్గాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయని వారు వెల్లడించారు. యాత్రికుల భద్రత కోసం ముందస్తు చర్యగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Mayawati: తమిళనాడు బీఎస్పీ చీఫ్ దారుణ హత్య.. మండిపడిన మాయావతి

3,800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని సందర్శించి, సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య 1.50 లక్షలు దాటింది. అనంతనాగ్‌లోని నున్వాన్-పహల్గామ్ మార్గం, గందర్‌బాల్‌లో బల్తాల్ మార్గాల గుండా జూన్‌ 29న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. ఆగస్టు 19న ముగుస్తుంది. గత ఏడాది 4.5 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకుని ప్రార్థనలు చేశారు.

నేడు భారీ వర్షాలు పడే అవకాశం లేదని.. అయితే గుహకు వెళ్లే ప్రాంతాలలో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అప్రమత్తతలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్‌నాథ్ ఆలయం వద్ద గరిష్టంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని, రాత్రి సమయంలో ఈ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల నాలుగు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేసింది.