Site icon NTV Telugu

Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువుల పూజలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..

Gyanvapi Case

Gyanvapi Case

Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు వివాదంలో అలహాబాద్ హైకోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, వారణాసి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ విచారించారు. కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారని కమిటీ తరుపున వాదిస్తున్న ఎస్ఎఫ్ఏ నఖ్వీ తెలిపారు.

కేసు విచారణ పూర్తైందని, కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని నఖ్వీ వెల్లడించారు. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ ఫిబ్రవరి 2న హైకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు జనవరి 31న మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌లో పూజలు నిర్వహించుకోవచ్చని వారణాసి కోర్టు తీర్పు ఇచ్చింది.

Read Also: Jairam Ramesh: ఫరూఖ్ అబ్దుల్లా నిర్ణయంపై జైరాం రమేష్ ఏమన్నారంటే..!

దీనికి ముందు, జ్ఞానవాపి మసీదు పూర్తిగా సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని వారణాసి కోర్టు కోరింది. ఏఎస్ఐ పరిశోధనలో మసీదుకు పూర్వం అక్కడ పెద్ద ఆలయం ఉండేదని తేలింది. మసీదు లోపలి భాగాల్లో హిందూ దేవీదేవతలకు సంబంధించిన గుర్తులు, తెలుగు, కన్నడ భాషలకు చెందిన పలు శాసనాలు లభించినట్లు ఏఎస్ఐ తన నివేదికలో పేర్కొంది. ముందుగా ఉన్న ఆలయ నిర్మాణాలను మసీదు నిర్మాణానికి వాడారని, మొత్తం 34 శాసనాలు దొరికాయని, వాటిలో జనార్దన, రుద్ర, ఉమేశ్వర పేర్లు కనిపించాయని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఏఎస్ఐ నివేదికను ఉటంకిస్తూ వెల్లడించారు.

Exit mobile version