All about lithium, could change India’s fate: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో చాలా విలువైన లిథియం ఖనిజం భారీ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఏకంగా 60 లక్షల టన్నుల ఖనిజం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ లిథియం భారతదేశ భవితను మార్చబోతుందా..? అంటే ఔననే సమాధానం వస్తుంది. కాస్మిక్ మెటల్ గా పేరొందిన లిథియంకు ప్రస్తుతం మార్కెట్ లో భారీగా డిమాండ్ ఉంది. రాబోయే కాలం ఎలక్ట్రానిక్స్, ఈవీ రంగంలో లిథియం బ్యాటరీల వినియోగం పెరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ లో భారీగా లిథియం నిల్వలు బయటపడటం శుభసూచకంగా కనిపిస్తోంది. కర్ణాటక మాండ్యా జిల్లాలో 1600 టన్నుల లిథియం నిల్వలు ఉన్నప్పటికీ.. ఇది వాణిజ్యపరంగా అంత లాభదాయకంగా లేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఆస్ట్రేలియా, చిలీ, చైనా దేశాలు అతిపెద్ద లిథియం ఉత్పత్తి, ఎగుమతిదారులుగా ఉన్నాయి. ప్రపంచానికి కావాల్సిన మెజారిటీ లిథియాన్ని ఈ మూడు దేశాలు సప్లై చేస్తున్నాయి.
Read Also: bachelors padayatra: పెళ్లి కోసం యువకుల పాదయాత్ర.. పాట్లు పడుతున్న పెళ్లికాని ప్రసాద్‌లు
అసలేంటీ లిథియం..ఎలా ఏర్పడుతుంది..?
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఖనిజాల్లో లిథియం ఒకటి. దీన్ని మొదటిసారిగా 1817లో జోహాన్ ఆగస్ట్ ఆర్ఫ్‌వెడ్‌సన్‌చే కనుకొనబడింది. లిథియం అనేది లిథోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ‘రాయి’ అని. అత్యల్ప సాంద్రత ఉన్న లిథియం నీటితో తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. విషపూరితం. అయితే లిథియం అనేది భూమిపై సహజంగా ఏర్పడలేదు. సూపర్ నోవా అనే నక్షత్ర విస్పోటనం సమయంలో ఈ మూలకం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నక్షత్ర పేలుళ్ల సమయంలో అణు ప్రతిచర్యలలో ఎక్కువ భాగం లిథియం ఉత్పత్తి అవుతుందని.. ఇది విశ్వం అంతటికి ప్రసరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లిథియం అయాన్ బ్యాటరీల వినియోగంలో..
ప్రస్తుతం ఎలక్ట్రానిక్, కంప్యూటింగ్, డిజిటలైజేషన్ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. చాలా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారు. ఇది ప్రపంచాన్ని క్లీన్ ఎనర్జీ వైపు నడిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అన్ని బ్యాటరీల్లో లిథియం బ్యాటరీలు శక్తివంతమైనవి. ప్రస్తుతం మొబైళ్లలో, ఎలక్ట్రిక్ వాహానాల్లో లిథియం అయాన్ బ్యాటరీని విరివిగా వాడుతున్నాం. లిథియం-అయాన్ బ్యాటరీపై చేసిన కృషికి స్టాన్లీ విట్టింగ్‌హామ్, జాన్ గూడెనఫ్ మరియు అకిరా యోషినోలకు 2019 సంవత్సరపు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
ప్రపంచానికి చాలా అవసరం..
ప్రపంచానికి ప్రస్తుతం లిథియం చాలా అవసరం. ప్రస్తుతం 200 కోట్ల ఈవీలు అవసరం అవుతాయని అంచనా వేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీని ప్రకారం 2025 నాటికి లిథియం కొరత ఏర్పడవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియాలో వెలుగులోకి వచ్చిన లిథియం నిల్వలు దేశానికి కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం దొరికిన నిల్వల్లో లిథియం ప్యూర్ ఫాంలో ఉంది. అత్యంత నాణ్యమైనదిగా ఉంది. ఈ ఖనిజం కోసం ఇతర దేశాలపై ఇండియా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.