Syria Crisis: మధ్యప్రాచ్యం మరోసారి అట్టుడుకుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్-హమాస్-హిజ్బుల్లా-ఇరాన్ వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉంటే, తాజాగా సిరియా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌పై తిరుగుబాటుదారులు పైచేయి సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజధాని డమాస్కస్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న అలెప్పోపై రెబల్స్ పట్టుసాధించారు. ఇప్పుడు రాజధాని డమాస్కస్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అలెప్పోకి దారి తీసే అన్ని రహదారుల్ని, సమీప ప్రాంతాలన్ని రెబల్స్ ఆక్రమించారు.
అల్ ఖైదా అనుబంధ సంస్థ హయాత్ తహరీర్ అల్ షమ్( హెచ్‌టీఎస్) తిరుగుబాటుదారులు అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకున్న తరుణంలో సిరియా రాజకీయాలు అత్యంత వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ సంస్థకు టర్కీ మద్దతు పలుకుతోంది. మరోవైపు ఇన్నాళ్లు బషర్ అల్ అసద్‌కి మద్దతు పలికిన రష్యా, ఇరాన్ పాత్ర ప్రస్తుత పరిణామాల్లో ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తిగా మారింది.
2011లో అంతర్యుద్ధం:
2000లో బషర్ అల్ అసద్ సిరియా అధ్యక్ష పదవిని చేపట్టారు. అప్పటి నుంచి సిరియాని పాలిస్తున్నారు. అసద్ కుటుంబం సిరియాలోని మైనారిటీ వర్గానికి చెందినది. ఇది మొత్తం జనాభాలో 10 శాతం మాత్రమే ఉంది. కానీ 1960 నుంచి రాజకీయాల్లో ఆధిపత్య పాత్ర పోషిస్తోంది. 2011లో అసద్‌కి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలిపారు. ఈ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ప్రభుత్వ అనుకూల, రెబల్ దళాల మధ్య హింస తీవ్రమైంది. మొత్తం 6 లక్షల మందిపౌరులు చనిపోయారు. అలెప్పోతో సహా చాలా నగరాలు ధ్వంసమయ్యాయి.
రష్యా, ఇరాన్, హిజ్బుల్లా అండతో అసద్ తన అధికారాన్ని స్థిరం చేసుకున్నాడు. గత రెండు మూడేళ్ల నుంచి అంతర్యుద్ధం తగ్గింది. అయితే, 2012లో 23 లక్షల జనాభా కలిగిన అలెప్పోని తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్యా, ఇరాన్ అండతో వీరి నుంచి 2016లో తిరిగి ప్రభుత్వం ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుంది.
తాజాగా హెచ్‌టీఎస్ అలెప్పోపై ఆకస్మిక దాడి చేసింది. దీంతో ప్రభుత్వ బలగాలు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే నగరాన్ని వారికి అప్పచెప్పారు. ఇప్పుడు రాజధాని డమాస్కస్‌పై తిరుగుబాటుదారుల కన్ను పడింది. రానున్న రోజుల్లో రాజధాని వైపు కదిలే అవకాశం కనిపిస్తోంది. రష్యా సయంతో తిరుగుబాటుదారులకు పట్టు ఉణ్న ఇడ్లిబ్, అటారెబ్ పట్టణాలపై రష్యా గగతనల దాడులు చేస్తోంది.
రష్యా, ఇరాన్ పూర్తిగా సహకరిస్తాయా..?
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిరియాకి పెద్ద ఎత్తున సాయం చేస్తుందా..? లేదా..? అనేదే సందేహం. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌పై దృష్టిసారించింది. ఇరాన్ ఇప్పుడు ఎక్కువగా ఇజ్రాయిల్‌ని ఎదుర్కొనేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. దీని కోసం హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారులకు సైనిక సాయం చేస్తోంది. మరోవైపు ఇజ్రాయిల్ ధాటికి హిజ్బుల్లా కుదేలైంది. టాప్ కమాండర్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మునుపటిలా ఈ రెండు దేశాలు అసద్‌ని రక్షిస్తాయో లేదో చూడాలి.