Akhilesh Yadav: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం నమోదు చేసింది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో ఏకంగా 200+ పైగా సీట్లను సాధించే దిశగా వెళ్తోంది. ఆర్జేడీ-కాంగ్రెస్-కమ్యూనిస్టుల కూటమి ‘‘మహాఘట్బంధన్’’ తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 30 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ కూటమి విజయం సాధిస్తాయని చెప్పినప్పటికీ, ఇలాంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీని అంచనా వేయలేకపోయాయి. మరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
Read Also: Ayyannapatrudu: పదవులు, అధికారం శాశ్వతం కాదు.. మంత్రికి స్పీకర్ చురకలు!
ఇదిలా ఉంటే, ఇండీ కూటమి నేతలు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు బీహార్‌లో ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ నిర్వహించింది. అయితే, దీంట్లో ఈసీ అనేక ఓట్లను తొలగించిందని, అవన్నీ ప్రతిపక్ష ఓట్లే అని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా, ఆర్జేడీ కూటమి ఓటమి, బీజేపీ కూటమి విజయంపై ఇండీ కూటమిలోని ప్రధాన భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ‘‘SIR గేమ్’’ పనిచేయదని అన్నారు.
‘‘బీహార్‌లో SIR ఆడే ఆట ఇకపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లేదా ఇతర చోట్ల సాధ్యం కాదు ఎందుకంటే ఈ ఎన్నికల కుట్ర ఇప్పుడు బహిర్గతమైంది’’ అని అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో తెలిపారు. ‘‘మేము వారిని ఈ ఆట ఆడనివ్వము. మేము అప్రమత్తంగా ఉండీ బీజేపీ ప్రణాళికల్ని అడ్డుకుంటాము. బీజేపీ ఒక పార్టీ కాదు, మోసగాడు’’ అని ఆరోపించారు. బీజేపీ గెలవలేక ఈసీని ఉపయోగించుకుని గందరగోళం సృష్టిస్తోందని అన్నారు.
