Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు అంశం కీలకంగా మారింది. యూపీలోని 403 స్థానాల్లో కాంగ్రెస్ 180కి పైగా సీట్లను కోరుతోంది. ఇదే సమయంలో ఎస్పీ 24 సీట్లను ఆఫర్ చేస్తోంది. దీంతో పొత్తు చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇదిలా ఉంటే, పొత్తులపై శనివారం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్తో చర్చలు కొనసాగుతున్నాయని, సీట్ల పంపకంతో గెలుపు అవకాశాలకే ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందనే అంచనాలు ఉంటేనే సీట్లు ఇస్తామనే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
లక్నోలో నిర్వహించిన విలేకరులు సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. సీట్ల పంపకానికి విజయమే ప్రాతిపదిక అవుతుందని స్పష్టం చేశారు. అంటే, ఏ నియోజకవర్గంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
ఇదే సమయంలో ఎన్నికల సంఘంపై అఖిలేష్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని గుడ్డిగా నమ్మకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కొంత మంది ప్రభుత్వ అధికారులు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, అలాంటి అధికారులు జాబితా సిద్ధం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఓటర్ల జాబితాలో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన 1.2 కోట్ల మంది హిందూ ఓట్లు తొలగించారని వ్యాఖ్యల్ని అఖిలేష్ ప్రస్తావించారు. దేశంలో ప్రజలు గౌరవం పొందడం, న్యాయం పొందడం కష్టంగా మారిందని, బీజేపీ అధికారంలో నుంచి దిగిపోతే సంక్షోభానికి ముగింపు పలుకొచ్చని అన్నారు.

