Site icon NTV Telugu

Akhilesh Yadav: లక్నోలో మ్యాచ్ రద్దుకు బీజేపీనే కారణం.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..

Akilesh

Akilesh

Akhilesh Yadav: లక్నోలో జరగాల్సిన భారత్- దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడంపై యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పెరిగిన కాలుష్యం ఇప్పుడు లక్నోకు కూడా చేరింది.. అందుకే ఈ మ్యాచ్ జరగలేదన్నారు. ఇది పొగ వల్ల కాదు, కాలుష్యంతో ఏర్పడిన స్మాగ్ కారణంగానే మ్యాచ్ రద్దయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ముఖాలను కప్పుకోవాలని తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సూచించారు. కాగా, లక్నోలో స్వచ్ఛమైన గాలి కోసం మేము నిర్మించిన పార్కులను బీజేపీ ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్ ఈవెంట్ల పేరుతో నాశనం చేస్తోంది.. బీజేపీ నేతలకు మనుషులపై, పర్యావరణంపై కూడా ప్రేమ లేదని ఆరోపించారు. లక్నోలోని ప్రజలు ఇప్పుడు తమ ముఖాలను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అఖిలేష్ యాదవ్ తెలిపారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, బుధవారం సాయంత్రం లక్నోలోని భారత్‌రత్న అటల్ బిహారీ వాజపేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్‌ దట్టమైన పొగమంచు కారణంగా అంపైర్లు రద్దు చేశారు. మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, టాస్ 7 గంటలకు జరగాల్సింది. కానీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు ఆరు సార్లు పిచ్ ను పరిశీలించినప్పటికీ ఆట ప్రారంభించలేమని నిర్ణయించారు. చివరికి రాత్రి 9.25 గంటలకు పరిశీలించి ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను క్యాన్సిల్ చేసేశారు. ఇక, మ్యాచ్ రద్దుతో స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా, భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే చివరి టీ20 మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.

Exit mobile version