Akhilesh Yadav: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈ కేసుని కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచారు. “ఆమె స్వయంగా ఒక మహిళ, ఆమె ఒక మహిళ బాధను అర్థం చేసుకుంటుంది.” అని అన్నారు.
Read Also: Crime: దారుణం.. తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
బీజేపీపై విరుచుకపడిన అఖిలేష్, ఈ విషయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని, అలా చేయకూడదని అన్నారు. ఈ ఘటనపై వైద్యులు నిరసన తెలుపుతున్నా బీజేపీ మాత్రం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసానికి సమీపంలో దళిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అంశాన్ని లేవనెత్తిన ఆయన, దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదని ఆరోపించారు.
69,000 మంది టీచర్ రిక్రూట్మెంట్ కేసులో కొత్త సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి ప్రస్తావిస్తూ.. బాధిత యువతకు ఇప్పుడు న్యాయం జరుగుతోందని, ప్రభుత్వ వివక్ష సరిదిద్దబడుతోందని అన్నారు. జస్టిస్ ఏఆర్ మసూది, జస్టిస్ బ్రిజ్‌రాజ్ సింగ్‌లతో కూడిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం జూన్ 2020 మరియు జనవరి 2022లో విడుదల చేసిన సెలక్షన్ జాబితాలను పక్కన పెట్టింది, ఇందులో రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన 6,800 మంది అభ్యర్థులు ఉన్నారు.
