Akali Dal: శిరోమణి అకాలీదళ్ పార్టీకి షాక్ తగిలింది. అత్యంత కీలమైన చండీగఢ్ ఎంపీ స్థానం నుంచి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న హర్దీప్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. జూన్ 1న చివరి విడతలో ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అకాలీదళ్ పార్టీ నుంచి తనకు ఎలాంటి మద్దతు లభించలేదని, ఎన్నికల్లో పోటీ చేయడానికి నిధుల కొరత ఎదుర్కొంటున్నందున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
గతం మూడు సార్లు కౌన్సిలర్‌గా ఉన్న 41 ఏళ్ల హర్దీప్ సింగ్, బీజేపీకి చెందిన సంజయ్ టాండన్, కాంగ్రెస్‌కి చెందిన మనీష్ తివారీతో పోటీ పడుతున్నారు. హర్‌దీప్ సింగ్ తండ్రి గుర్నామ్ సింగ్, అతని సోదరుడు మల్కియాత్ సింగ్ 2006 నుంచి 2011 వరకు చండీగఢ్ కౌన్సిలర్‌లుగా ఉన్నారు. అయితే, వీరిద్దరు తమ పదవీకాలంలోనే మరణించారు. 2015లో సోదరుడి మరణం తర్వాత హర్దీప్ సింగ్ కౌన్సిల్‌లో స్థానాన్ని సాధించారు. 2016-2021 వరకు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇతను సీనియర్ డిప్యూటీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్‌గా కూడా పనిచేశారు. గతంలో జరిగిన అన్ని లోక్‌సభ ఎన్నికలలో, అకాలీదళ్ చండీగఢ్‌లో బిజెపి అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. అయితే ఈసారి ఒంటరిగా పోటీ చేసి తొలిసారి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు.