Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..

  • CEC జ్ఞానేష్ కుమార్‌పై యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ తీవ్ర ఆరోపణలు
  • ‘‘అవినీతిపరుడు, నిజాయితీ లేని అధికారి’’ అంటూ వ్యాఖ్యలు
  • 2024 వారణాసి లోక్‌సభ ఎన్నిక రద్దు చేయాలని కోరిన అజయ్ రాయ్
  • వారణాసిలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్
Ajay Rai

Ajay Rai

Congress: 2027లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు అజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయడంతో పాటు, 2024లో ప్రధాని నరేంద్రమోడీ గెలిచిన వారణాసి లోక్‌సభ ఎన్నికల్ని రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఆగ్రాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేష్ కుమార్ అవినీతిపరుడని, నిజాయితీ లేని అధికారి అని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి బీజేపీ గెలిచిందని, బీజేపీకి ఆయన సహకరించారని అన్నారు. జ్ఞానేష్ కుమార్ పదవిలో ఉన్న సమయంలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్ని రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసిన నరేంద్రమోడీ మరోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మోడీ 6,12,970 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన అజయ్ రాయ్‌కు 4,60,457 ఓట్లు వచ్చాయి. మోదీ 1,52,513 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఫలితాలపై అజయ్ రాయ్ అనుమానాలు వ్యక్తం చేశారు. వారణాసి ఎన్నికల్ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరారు.