Air India Incident: ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన విమానయాన రంగంలో ప్రకంపనలు రేపుతోంది. నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా తన తోటి ప్రయాణికురాలు సీనియర్ సిటిజన్ అయిన మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మద్యంమత్తులో ఇలాంటి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే ఆ సమయంలో ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మెంబర్లు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఈ ఘటనపై మహిళ ఎయిర్ ఇండియా సిబ్బందికి తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ జరుపుతోంది. దీంతో పాటు ఢిల్లీ పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది.
Read Also: CBI: ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగింత..
ఇదిలా ఉంటే శంకర్ మిశ్రా పనిచేస్తున్న వెల్స్ ఫార్గో అనే కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను కూడా జారీ చేసింది. వెల్స్ ఫార్గో సంస్థ వృత్తిపరమైన, వ్యక్తిగతమైన అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని.. తమ కంపెనీ ఉద్యోగిపై వచ్చిన ఆరోపణ తీవ్రత కారణంగా అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఏదైనా అదనపు విచారణకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ వెల్లడించింది. కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంగా వెల్ ఫార్గో సంస్థ పనిచేస్తుంది. శంకర్ మిశ్రా ఇండియా చాప్టర్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
ప్రస్తుతం శంకర్ మిశ్రా కోసం ఢిల్లీ పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. ముంబైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి డీజీసీఏ, ఎయిర్ ఇండియా టాటా గ్రూపుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో సిబ్బంది ‘అన్‌ప్రొఫెషనల్’ గా వ్యవహరించారని పేర్కొంది.