Air India Express flight emergency landing in muscat: ఇండిగో ఫ్లైట్ కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయాన్ని మరవకు ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం కాలికట్ నుంచి దుబాయ్ కు వెళ్తున్న సయయంలో మార్గం మధ్యలో ఒమన్ రాజధాని మస్కట్ కు మళ్లించారు. బోయింగ్ 737(వీటీ-ఏఎక్స్ఎక్స్) ఐఎక్స్ -355 విమానం కాలికట్ నుంచి దుబాయ్ కు వెళ్తున్న క్రమంలో విమానంలో కాలిన వాసన వచ్చింది. దీంతో ముందుజాగ్రత్తగా పైలెట్లు విమానాన్ని మస్కట్ లో ల్యాండ్ చేశారు. ఫార్వర్డ్ గాలీలోని వెంట్లలో ఒక దాని నుంచి కాలిన వాసన వచ్చిందని దీంతో సమీపంలో ఉన్న మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది.
అంతకు ముందు షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పాకిస్తాన్ కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఇండిగో పైలెట్లు విమానంలోని ఒక ఇంజిన్ లో సాంకేతిక లోపం గుర్తించడంతో విమానాన్ని కరాచీకి మళ్లించారు. ప్రయాణికులను హైదరాబాద్ తరలించేందుకు మరో విమానం కరాచీ వెళ్లింది. ఈ రెండు ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరుపుతోంది.
Read Also: IndiGo: ఇండిగో ఫ్లైట్ సాంకేతిక లోపం.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇటీవల కాలంలో ఇండియాకు చెందిన పలు అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. జూన్ 5న ఢిల్లీ నుంచి దుబాయ్ కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ పనిచేయకపోవడంతో ఇదే కరాచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండిగ్ చేశారు. ఇటీవల రెండు రోజుల ముందు ఇండిగోకు చెందిన విమానం ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న క్రమంలో కొన్ని సెకన్ల పాటు కంపించడంతో జైపూర్ విమానాశ్రమంలో ల్యాండ్ చేశారు.
ఇదిలా ఉంటూ జూలై 16న పలు అంతర్జాతీయ విమాన సంస్థలకు చెందిన విమానాలు ఇండియాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యాయి. ఇథియోపియా అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానంలో క్యాబిన్ ప్రెజర్ సమస్యలు రావడంతో కోల్ కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని… శ్రీలంక ఎయిర్ లైన్స్ విమానంలో హైడ్రాలిక్స్ సమస్య రావడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది.
