Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: విమానంలో ఎలాంటి సమస్యలు లేవు.. ఎయిరిండియా సీఈవో ప్రకటన

Ahmedabadplanecrash2

Ahmedabadplanecrash2

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదికపై ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ స్పందించారు. ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి సమస్య లేనట్లుగా తెలిపారు. ఇంజిన్‌లో గానీ.. స్విచ్‌ల్లో గానీ ఎలాంటి నిర్వహణ సమస్యలు లేవని తేల్చి చెప్పారు. బోయింగ్ విమానం పూర్తిగా సేఫ్‌గా ఉందని ఎయిరిండియా సీఈవో తెలిపారు. ఇంధన స్విచ్‌లపై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం అని తేల్చారు. ఆ స్విచ్‌లను ఎయిరిండియా రెండు సార్లు మార్చినట్లుగా సమాచారం. ఇక ఇంధన స్విచ్‌లు పూర్తిగా సురక్షితమని అమెరికాకు చెందిన సంస్థ కూడా తేల్చింది. అయితే విమానం టేకాప్ అయిన తర్వాత రెండు స్విచ్‌లు ఎందుకు ఆపివేయబడ్డాయన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఒకేసారి రెండు ఇంధన స్విచ్‌ ఆప్‌లు ఆగడంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో సెకన్ల వ్యవధిలోనే విమానం ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిపోయింది.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: పైలట్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎలా నిర్ధారిస్తారు.. అంతర్జాతీయ కథనాలపై యూనియన్లు మండిపాటు

ఇక విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ముందు ఇద్దరు పైలట్లకు శ్వాస పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో వారిద్దరూ బాగానే ఉన్నారు. ఇక వేరే వైద్య పరీక్షలు మాత్రం జరగలేనట్లుగా సమాచారం. ఇంకా పూర్తిగా దర్యాప్తు ముగియలేదని.. ముందుగానే లేనిపోని కథనాలు సృష్టించొద్దని విల్సన్ కోరారు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందే విమానాన్ని తనిఖీలు చేశామని.. సేవలకు అనుకూలంగా ఉన్నాదని నిర్ధారించుకున్నాకే ఉపయోగించినట్లు చెప్పారు. ప్రతి విమానాన్ని తనిఖీలు చేస్తామని.. అంతేకాకుండా ఏవైనా కొత్త సూచనలు వస్తే వాటిని కూడా పాటిస్తూ ఉంటామని విల్సన్ చెప్పుకొచ్చారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న బృందంలో విల్సన్ కూడా ఉన్నారు.

ఆత్మహత్య వార్తలు ఖండన..
ఇదిలా ఉంటే పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చనిపోయిన వారిని దూషించొద్దని కోరాయి. ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని.. పారదర్శకత కోసం పిలుపునిస్తున్నట్లు తెలిపాయి. దయచేసి ఎవరిని బలిపశువులను చేయొద్దని కోరాయి. పైలట్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వస్తున్న మీడియా కథనం పట్ల తీవ్రంగా కలత చెందినట్లు ఎయిర్ ఇండియాలో నారో-బాడీ పైలట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐసీపీఏ తెలిపింది. నిశ్చయాత్మక ఆధారాలు లేకుండా పైలట్లను నిందించడం ఏ మాత్రం భావ్యం కాదని పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Love Couple Suicide: ప్రియురాలిని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.

Exit mobile version