Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!

  • ఫుకెట్–ఢిల్లీ AI2379 విమాన ఘటనలో కీలక పరిణామం
  • పైలట్-ఇన్-కమాండ్‌కు నిర్ధారణ డ్రగ్ టెస్ట్‌లో మారిజువానా పాజిటివ్
Air India Incident

Air India Incident

Air India Incident: ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా AI2379 విమానం అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తుకు జారిపోయిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానం పైలట్ ఇన్ కమాండ్‌కు నిర్వహించిన టెస్టుల్లో ‘‘గంజాయి’’ తీసుకున్నట్లు తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అనంతరం ఇద్దరు పైలట్లకు తప్పనిసరి సైకోఆక్టివ్ సబ్‌స్టెన్స్ స్క్రీనింగ్ నిర్వహించారు. కో-పైలట్ పరీక్షలో ఎలాంటి అనుమానాస్పద ఫలితం కనిపించలేదు. అయితే పైలట్-ఇన్-కమాండ్‌కు నిర్వహించిన పరీక్షల్లో మారిజువానా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు పైలట్లను ఫ్లయింగ్ రోస్టర్ నుంచి తొలగించారు. అయితే విమానం నడిపే సమయంలో పైలట్ మత్తులో ఉన్నాడని లేదా విమానం ఆకస్మాత్తుగా కిందకు జారిపోవడానికి కారణమని ఇప్పటి వరకు నిర్ధారించబడలేదు.

ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ బస్ ఏ320 విమానం అకస్మత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు శిశువులతో సహా 137 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. టర్బులెన్స్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని, కొందరికి వెన్నెముక, మెడకు గాయాలైనట్లు కేంద్ర పౌరవిమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. చివరకు విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీరియస్‌ అయ్యింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. విమానంలోని ప్లైట్ డేటా రికార్డర్(FDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) స్వాధీనం చేసుకున్నారు.