Asaduddin Owaisi: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం సంచలన విజయాలను నమోదు చేసుకుంది. ఔరంగాబాద్, ముంబై, నాగ్‌పూర్ వంటి నగరాల్లో తన ఉనికిని చాటింది. మొత్తంగా 125 మంది ఎంఐఎం కార్పొరేటర్లుగా గెలిచారు. అయితే, ఈ విజయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఆత్మపరిశీలిన చేసుకోవాలని ప్రతిపక్షాలకు ఓవైసీ హితవు పలికారు.
Read Also: Her Voice Her Story: భారతీయ సంగీతాన్ని మలుపు తిప్పిన మహిళల కథ.. ‘హర్ వాయిస్.. హర్ స్టోరీ’
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంఐఎం పార్టీ సిద్ధమవుతోందని, ఆసక్తి ఉన్న అభ్యర్థుల పేర్లను పార్టీ ఇప్పటికే కోరిందని అన్నారు. ‘‘ ఇప్పుడు మమ్మల్ని (బీజేపీకి బీ టీమ్) అని దూషించే పార్టీలు తమ గురించి ఆలోచించుకోవాలి. విజయానికి చాలా కారణాలు ఉంటాయి. ఓటమికి ఇలాంటివి ఉండవు. మేమెందుకు గెలిచాం, వారు ఎందుకు ఓడిపోయారు వారే చెప్పాలి’’ అని ఓవైసీ అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల కలయిక గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఫలితాలు అందరి ముందే ఉన్నాయని, ఏక్‌నాథ్ షిండే ఇల్లు ఉన్న ప్రాంతంలో ఉద్ధవ్ పార్టీ అభ్యర్థి గెలిచారని అన్నారు. తమ పార్టీ గెలిచిందనే ఆనందంలో ఉన్నానని, ఇతరుల గురించి తనకు తెలియదని ఆయన అన్నారు. పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థులు పార్టీతోనే ఉంటారని ఓవైసీ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన కార్పొరేటర్లను ఏకతాటిపై ఉంచడానికి అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
