Site icon NTV Telugu

AICC: ఏఐసీసీ కీలక నిర్ణయం.. అభ్యర్థుల ఎంపిక బాధ్యత వారికే..!

Mallikarjunkharge

Mallikarjunkharge

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీ అధ్యక్షులకు పవర్స్ అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీ అధ్యక్షులకు అప్పగిస్తూ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఏఐసీసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.

ఖర్గే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మోడీ కేవలం పబ్లిసిటీ కోసమే తాపత్రయపడతారని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా ఆలోచన దారుణ వైఫల్యం అన్నారు. రాజకీయ పార్టీ భావజాలం దేశాన్ని మించిపోతే.. తెచ్చుకున్న స్వాతంత్ర్యం నిష్‌ప్రయోజనం అవుతుందని చెప్పారు. ఈ విషయంలో అంబేద్కర్ ఎప్పుడో అప్రమత్తం చేశారన్నారు.

తమిళనాడు గవర్నర్‌ తీరుపై సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టు అన్నారు. ఏళ్ల తరబడి గవర్నర్లు బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారన్నారు. ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీ పలు చట్టాలు చేసిందని పేర్కొన్నారు. భూసేకరణ చట్టం, తప్పనిసరి విద్య, అటవీ రక్షణ లాంటి చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని తెలిపారు. వెనుకబడిన వర్గాల గురించి బీజేపీ నాయకులు గొప్పగా మాట్లాడతారు.. కానీ కులగణన మాత్రం చేయరని ధ్వజమెత్తారు.

పేదలు, అణగారిన వర్గాల ఉన్నతి గురించి ఆలోచించే నాయకుడు రాహుల్ గాంధీ అని ఖర్గే తెలిపారు. సోనియా గాంధీ ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. దేశంలో అత్యాచారాలు జరగకుండా అమిత్ షా నిలువరించాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక ఏఐసీసీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులుగా వివిధ హోదాల్లో పనిచేసి స్వర్గస్తులయిన పలువురు నాయకులకు సభ నివాళులు అర్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన డీ. శ్రీనివాస్, నర్సారెడ్డి, ఏఐసీసీ సభ్యులుగా పని చేసిన ఇంద్రసేనారెడ్డి, టి.నాగయ్యలకు సభలో నివాళులు అర్పించారు.

Exit mobile version