Site icon NTV Telugu

Agnipath Bharat Bandh: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్

Bandh

Bandh

దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా ‘అగ్నిపథ్‌’ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని? ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశ్నిస్తూ.. నిరసనలు చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్‌ ఆందోళన హైదరాబాద్‌కు కూడా పాకింది.

కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బిహార్‌, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో యువకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తక్షణమే అగ్నిపథ్‌ పథకంను కేంద్రం ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా యువత డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో నేడు భారత్‌ బంద్‌కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. బిహార్లో ఆందోళన చేస్తున్న యువకులు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి ఆర్జేడీ మద్దతు ప్రకటించింది. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయని తెలుస్తోంది.

Navy Chief: అగ్నిపథ్‌.. భారత సైన్యంలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌

అగ్నిపథ్​ విధానంపై దేశంలోని నిరుద్యోగ యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శాశ్వతంగా సైన్యంలో చేరాలనుకునే తమ కలలను నీరుగార్చే విధంగా కేంద్రం నిర్ణయం ఉందని వారు అంటున్నారు. నాలుగేళ్ల షార్ట్ సర్వీస్ తర్వాత మళ్లీ సాధారణ నిరుద్యోగుల్లా ఇతరులతో తాము పోటీ పడాలా? ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిససనలు చేపట్టి విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి యూపీ, బిహార్, తెలంగాణ యువత నుంచి అగ్నిపథ్​పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శుక్రవారం ఆందోళనకారులు రైల్వే స్టేషన్లలోకి ప్రవేశించి రైళ్లకు నిప్పంటించారు. చాలా బోగీలను తగలబెట్టారు. రైల్వే స్టేషన్లలోని దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులు వీరిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. బాష్పవాయువు కూడా ప్రయోగించారు. దీంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సైనిక నియామకాలు పాత పద్ధతిలోనే చేపట్టాలని, కొత్త విధానాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

 

 

Exit mobile version