Lakshadweep: ఇండియా-మాల్దీవ్స్ వివాదం నడుమ ‘‘లక్షద్వీప్’’ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారతదేశంలో మొన్నటి వరకు పెద్దగా భారతీయులే పట్టించుకోని ఈ ద్వీపాల గురించి ప్రస్తుతం ప్రపంచమే సెర్చ్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఒక్క పర్యటన లక్షద్వీప్ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రపంచ టూరిస్టులు ఈ ఐలాండ్స్ గురించి ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. సరైన విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరో మాల్దీవ్స్ అవుతాయంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also: 12th Fail: “12th ఫెయిల్”పై ఐఏఎస్ అవనీష్ శరణ్ ప్రశంసలు.. అద్భుతం అంటూ కితాబు..
గూగుల్ ట్రెండ్స్ ప్రకారం.. ఆన్‌లైన్‌లో లక్షద్వీప్ గురించి సెర్చ్ చేస్తున్నట్లు వెల్లడైంది. వరసగా రెండో రోజు కూడా లక్షద్వీప్ గురించి చాలా మంది శోధిస్తున్నారు. దీంతో గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగాలు వెల్లడించాయి. మరోవైపు ప్రముఖ టూరిజం, ట్రావెల్ ప్లాట్‌ఫాం ‘మేక్ మై ట్రిప్’లో లక్షద్వీప్ గురించి వెతకడం 3400 శాతం పెరిగిందని ఆ సంస్థ తెలిపింది. మాల్దీవ్స్ బుకింగ్స్ రద్దు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఒక్క శుక్రవారం రోజే 50 వేల మంది గూగుల్ లో వెతికారు. ఇక మోడీ పర్యటన తర్వాత ఈ సంఖ్య ఏకంగా గణనీయంగా పెరిగింది.
ఇటీవల ప్రధాని మోడీ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు లక్షద్వీప్‌లో పర్యటించారు. అక్కడ కవరత్తితో పాటు పలు బీచుల సౌందర్యాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో మాల్దీవ్స్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. చైనా అనుకూలంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జులో ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు ప్రధానిమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం నెలకొంది. ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల్దీవ్స్ హోటల్, ఫ్లైట్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు.