Site icon NTV Telugu

Global Optimism Index: ఆపరేషన్ సిందూర్ తర్వాత ‘‘ఆశావాద సూచిక’’లో భారత్ 4వ ర్యాంక్..

Operation Sindoor

Operation Sindoor

Global Optimism Index: జాతీయ ఆశావాదంలో భారతదేశం ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌లో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వార భారతీయల్లో ఆశావాద దృక్పథం పెరిగిందని ఇప్సోస్ ‘‘వాట్ వర్రీస్ ది వరల్డ్’’ సర్వే చెప్పింది. మే 2025 ఎడిషన్‌లో భారత్ మూడు శాతం పాయింట్లు ఎగబాకి జాతీయ ఆశావాదంలో గణనీయమైన పెరుగుదల నివేదించినట్లు చెప్పింది. ప్రపంచంలోనే సింగపూర్, మలేషియా, ఇండోనేషియా తర్వాత ‘‘గ్లోబల్ ఆప్టిమిజం ఇండెక్స్’’లో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ జాతీయ సెంటిమెంట్ తో పెరుగుదల వచ్చినట్లు వెల్లడించింది.

సర్వే ప్రకారం, భారతీయుల్లో 65 శాతం మంది దేశం సరైన దిశలో వెళ్తుందని నమ్ముతున్నారు. మునుపటి సర్వేలో ఇది 62 శాతం ఉంది. అయితే, దీనికి విరుద్ధం ప్రపంచ సగటు కేవలం 37 శాతం మాత్రమే ఉంది. ముఖ్యంగా, అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో నిరాశావాదం చాలా బలంగా కనిపించింది. ఫ్రాన్స్, దక్షిణ కొరియా, పెరూ దేశాలు చివరి స్థానాల్లో ఉన్నాయి.

Read Also: Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి సమయం ఆసన్నమైంది.. ట్రంప్ కీలక ప్రకటన

భారతదేశంలో ఆశావాదం పెరగడానికి మే 7న ఉగ్రవాదులే టార్గెట్‌గా పాకిస్తాన్‌పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ కారణమని చెప్పారు. దాదాపుగా 25 నిమిషాల్లో భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత, పాక్ చేసిన మిస్సైల్, డ్రోన్ అటాక్స్‌ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న వైమానిక స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 11 ఎయిర్‌బేసులు ధ్వంసమయ్యాయి. కీలక వ్యవస్థల్ని పాకిస్తాన్ కోల్పోయింది.

Read Also: Bharat Bandh: జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపు.. మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ..

ఇదిలా ఉంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతీయులు ఉగ్రవాదాన్ని ప్రమాదకర సమస్యగా భావించే శాతం 26గా ఉంది. ఇది అక్టోబర్ 2019లో తర్వాత నమోదైన అత్యధిక స్థాయి. ద్రవ్యోల్బనం(37 శాతం), నిరుద్యోగం(33) శాతం తర్వాత టెర్రరిజం సమస్యగా ఉందని ఇప్సోస్ సర్వేలో తేలింది. నేరాలు-హింస(25 శాతం), రాజకీయ-ఆర్థిక అవినీతి(21 శాతం)గా ఉంది.

గ్లోబల్ సౌత్‌లోని దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయని ఇప్సోస్ ఆశావాద సూచిక చూపిస్తుంది. సింగపూర్ 77 శాతంతో ముందంజలో ఉంది, తరువాత మలేషియా (69 శాతం), ఇండోనేషియా (67 శాతం), మరియు భారతదేశం (65 శాతం) ఉన్నాయి. అర్జెంటీనా (56 శాతం), థాయిలాండ్ (45 శాతం), మెక్సికో (45 శాతం) మొదటి ఏడు స్థానాల్లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. ఫ్రాన్స్ 19 శాతం మాత్రమే తమ దేశం సరైన మార్గంలో వెళ్తుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. దక్షిణ కొరియాలో 15 శాతం, పెరూలో 9 శాతం ప్రజలు ఆశావాదంతో ఉన్నారని చెప్పింది.

Exit mobile version