Wayanad Tragedy: వయనాడ్‌లో ఇటీవల వరదలతో పాటు కొండచరియలు విరిగి పడిన ఘటనలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యువతి జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది. సర్వస్వం కోల్పోయి.. ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకుంది. దీంతో అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన ఆ యువతి బాధ వర్ణణాతీతంగా మారింది.
Read Also: Dates: పోషకాల సూపర్ ఫుడ్ కోసం చూస్తుంటే బెస్ట్ ఛాయస్ ఇవే..
కేరళలోని వయనాడ్ జిల్లా చూరాల్‌మల గ్రామానికి చెందిన శ్రుతి (24)కి తన చిరకాల మిత్రుడైన జెన్సన్ (27)తో జూన్ 2న వివాహం నిశ్చయమైంది. వారి ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించారు. అయితే జూన్ 30న ప్రకృతి సృష్టించిన విలయతాండవం.. శ్రుతి జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరితో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఈ విషాద సమయంలో జెన్సన్ ఆమెకు అండగా నిలిచాడు. కష్టకాలంలో తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని అనుక్షణం ఆమె వెంటే ఉన్నాడు. వరద ప్రాంతాల పర్యటనకు ప్రధాని మోడీ వచ్చినప్పుడు సైతం వీరిద్దరు కలిసే మాట్లాడారు. జాతీయ మీడియా సైతం ఈ జంట మనోనిబ్బరాన్ని గుర్తిస్తూ వార్తలు ప్రచురించింది. కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు శ్మశానవాటికకు చేరుకొని.. జీవితాంతం ఒకరికొకరు తోడుంటామని సమాధుల మధ్యే ఆ సమయంలో ప్రమాణం చేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సెప్టెంబర్‌లో తాము రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
Read Also: Israel Air Strike : పాఠశాల టార్గెట్ గా గాజాలో ఎయిర్ స్ట్రైక్ చేసిన ఇజ్రాయెల్.. 34 మంది మృతి
అయితే, తన కుటుంబ సభ్యులను కోల్పోయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న శ్రుతి జీవితంలో మరో పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. ఆమె కాబోయే భర్త జెన్సన్ (27) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. సెప్టెంబర్ 10న శ్రుతి, జెన్సన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యాన్‌లో బయలుదేరారు. కోజికోడ్-కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వాహనం, ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో జెన్సన్ తీవ్రంగా గాయపడగా, శ్రుతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో జెన్సన్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తన చిరకాల మిత్రుడు, కాబోయే భర్త మృతి చెందడంతో శ్రుతి జీవితం మరోసారి తలకిందులైనట్లైంది.