NTV Telugu Site icon

Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు విక్రయాలు

Salmanrushdie

Salmanrushdie

భారతీయ-బ్రిటిష్ ఆంగ్ల రచయిత సల్మాన్ రష్దీకి చెందిన వివాదాస్పద నవల ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు దాదాపు 36 ఏళ్ల నిషేధం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోని బహ్రిసన్స్ బుక్‌స్టాల్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ వివాదాస్పద నవలను రాజీవ్ గాంధీ ప్రభుత్వం అక్టోబర్ 5, 1988లో పుస్తకం దిగుమతిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ కేసును ఢిల్లీ హైకోర్టు క్లోజ్ చేసింది. దీంతో తిరిగి 37 ఏళ్ల తర్వాత ఈ పుస్తకం హస్తినలో దర్శనమిచ్చింది. కేవలం లిమిటెడ్ స్థాయిలో ప్రదర్శనలో ఉంచారు.

ది సైటానిక్ వెర్సెస్ నవల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రచయిత రష్దీపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. ముస్లింలు వ్యతిరేకించిన ప్రవచనాలను బయటపెట్టినందుకు సల్మాన్ రష్దీ హత్యకు ఫత్వా జారీ అయింది. 1989లో ఇరాన్‌కు చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు అయాతొల్లాహ్ ఖొమెయినీ.. సల్మాన్ రష్దీని హత్య చేయాలని ఫత్వా జారీ చేశారు. అంతేకాదు ఈ నవలను జపాన్ భాషలోకి అనువదిందిన హితోషి ఇగరాషిని జూలై 1991లో పొడిచి చంపారు. ఇటాలియన్ అనువాదకుడు ఎట్టోర్ కాప్రియోలో కత్తి పోట్లకి గురై బతికి బయట పడ్డాడు. 1993 అక్టోబరులో నవల పబ్లిషర్ విలియం నైగార్డ్ పైన హత్యా ప్రయత్నం చేశారు. 1993 జూలై 2న టర్కిష్ అనువాదకుడు అజీజ్ నేసిన్ కత్తిపోట్లకి గురై బతికాడు. ఇక ఈ నవలను ఇండియాతో పాటు చాలా ఇస్లామిక్ దేశాల్లో నిషేధించారు.

నవల దిగుమతిపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నవంబర్‌లో విచారణను ముగించింది. దీనిపై ప్రభుత్వ అధికారులు సరైన వాదనలు వినిపించకపోవడంతో ఈ కేసును న్యాయస్థానం క్లోజ్ చేసింది. దీంతో పుస్తకాల విక్రయాలకు తిరిగి మార్గం సుగమం అయింది. మొత్తానికి 37 ఏళ్ల తర్వాత రష్దీ పుస్తకాలు విక్రయాలు జరుగుతున్నాయి.

Show comments