NTV Telugu Site icon

Cinema At Manipur: మణిపూర్‌లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన

Cinema At Manipur

Cinema At Manipur

Cinema At Manipur: జాతుల మధ్య హింసతో గత మూడు నెలలుగా నలిగిపోయిన మణిపూర్‌లో కొద్ది కొద్దిగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అవగా.. రాష్ట్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను సైతం తిప్పుతోంది. ఇక ఇపుడు ఏకంగా 23 ఏళ్ల తరువాత రాష్ట్రంలో హిందీ సినిమా ప్రదర్శనను సైతం చేపట్టారు. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో హిందీ సినిమా ప్రదర్శించవద్దని మైతీ ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో బంద్‌ అయిన హిందీ సినిమాల ప్రదర్శన 23 ఏళ్ల తరువాత మంగళవారం తిరిగి ప్రారంభం అయింది. మణిపూర్‌లో మే 3 నుంచి జాతుల మధ్య ఘర్షణలతో రాష్ట్రం రావణ కాష్టంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు. మైతీ ఉగ్రవాద సంస్థ హిందీ సినిమా ప్రదర్శించవద్దని 2000 ఏడాదిలో హెచ్చరించడంతో అక్కడ బాలీవుడ్ సినిమాలు ప్రదర్శనకు నోచుకోకపోవడం గమనార్హం. 1998 సంవత్సరంలో చివరిగా ప్రదర్శితమైన సినిమా కుచ్‌ కుచ్‌ హోతా హై. ఆ తరువాత 2000 సంవత్సరంలో రాష్ట్రంలో హిందీ సినిమాల ప్రదర్శన చేయరాదని నిషేధం విధించారు.

Read also: Gadar 2: ప్రమాదంలో పఠాన్ రికార్డ్స్… హిందుస్థాన్ జిందాబాద్ నినాదం నార్త్ ని కమ్మేసింది

23 ఏళ్ల తర్వాత మణిపూర్‌ హింసాకాండలో తీవ్రంగా ప్రభావితమైన చురాచందాపూర్‌ జిల్లాలో హిందీ సినిమాను ప్రదర్శించారు. ఇది ఇంఫాల్‌కు 63 కి.మీ.దూరంలో ఉంది. చురాచందాపూర్‌ జిల్లాలోని రెంగ్‌కైలోని ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో మంగళవారం విక్కీ కౌశల్‌ నటించిన ‘ఉరి..ద సర్జికల్‌ స్ట్రైక్‌’ చిత్రాన్ని ప్రదర్శించగా.. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. మైతీ వేర్పాటువాద సంస్థ ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’కి చెందిన పొలిటికల్ వింగ్ రివల్యూషనరీ పీపుల్స్‌ ఫ్రంట్‌ 2000 సెప్టెంబరులో హిందీ చిత్రాలను మణిపూర్‌లో ప్రదర్శించ వద్దని హెచ్చరించింది. అప్పటి నుంచి మణిపూర్‌లో బాలీవుడ్ చిత్రాల ప్రదర్శన ఆగిపోయింది. తిరిగి మంగళవారం ‘హమర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌’(హెచ్‌ఎస్‌ఏ) చొరవతో తిరిగి ప్రారంభమయింది. ఇండోజెనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ అధికార ప్రతినిధి గింజా వల్జాంగ్ మాట్లాడుతూ.. ‘మా ఊరిలో ఓ సినిమా ప్రదర్శించి రెండు దశాబ్దాలు దాటింది. మైతీలు చాలా కాలంగా హిందీ సినిమాలను నిషేధించారు. ఆ గ్రూపు దేశవ్యతిరేక విధానాలను ధిక్కరించి, భారతదేశంపై మన ప్రేమను చాటుకోవడమే నేటి ప్రయత్నం’ అని అన్నారు. ‘దశాబ్దాలుగా ఆదివాసీలను లొంగదీసుకున్న ఉగ్రవాద గ్రూపులకు మా ధిక్కరణ, వ్యతిరేకత బయటపెట్టడమే బాలీవుడ్ సినిమా ప్రదర్శన అని చెప్పింది. ‘స్వేచ్ఛ, న్యాయం కోసం మా పోరాటాన్ని కొనసాగించడానికి ప్రతిజ్ఞ చేయడంలో మాతో చేరండి’ అని ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ సోమవారం విజ్ఞప్తి చేసింది. ఈ సంస్థ ప్రకారం చివరిసారిగా మణిపూర్‌లో షారుక్ ఖాన్ నటించిన కుచ్ కుచ్ హోతా హై చిత్రాన్ని 1998లో ప్రదర్శించారు. బాలీవుడ్ సినిమాలను ప్రదర్శించొద్దని మైతీ రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ 2000 సెప్టెంబరులో హెచ్చరించింది. హెచ్చరిక జారీ చేసిన వారం రోజుల్లో హిందీ సినిమాలకు చెందిన దాదాపు 8 వేల వీడియో, ఆడియో క్యాసెట్లు, సీడీలను రెబల్స్ తగులబెట్టారు.