NTV Telugu Site icon

Adhir Ranjan Chowdhury: ‘‘దేశంలో నిగ్రిటో ప్రజలు ఉన్నారు’’.. అధిర్ వ్యాఖ్యల కలకలం.. ఇరకాటంలో కాంగ్రెస్..

Adhir Ranjan Chowdhury

Adhir Ranjan Chowdhury

Adhir Ranjan Chowdhury: ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ చీఫ్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దేశంలో ఉత్తర భారతీయులు తెల్లగా, దక్షిణాది వారు ఆఫ్రికన్లుగా, ఈశాన్య ప్రజలు చైనీయులుగా, పశ్చిమాన ఉన్న వారు అరబ్బులుగా కనిపిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. బీజేపీ కాంగ్రెస్, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఇండియా కూటమి ఇలాంటి వ్యాఖ్యల్ని హర్షిందని ఓ ప్రకటన చేసింది. ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన పదవికి బుధవారం రాజీనామా చేశారు.

Read Also: RCB vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..

ఇప్పటికే పిట్రోడా వ్యాఖ్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ని, ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటంలోకి నెట్టాయి. గురువారం అధిర్ మాట్లాడుతూ.. ‘‘మాకు ప్రోటో ఆస్ట్రాలాయిడ్స్, మంగోలాయిడ్లు, (మరియు) నెగ్రిటో తరగతి ప్రజలు ఉన్నారు. మన దేశ జనాభాలో ప్రాంతీయ లక్షణాలు భిన్నంగా ఉంటాయి.’’ అని పిట్రోడా వ్యాఖ్యల్ని సమర్థించేందుకు చేసిన ప్రయత్నంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొందమంది తెల్లగా, మరికొందరు నల్లగా ఉంటారనేది నిజమని అధిర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నిగ్రిటోలుగా భారతీయులను పోల్చడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేత షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ఇది ఒక్క అంకుల్ శామ్(శామ్ పిట్రోడా) ఆలోచన మాత్రమే కాదని, మొత్తం కాంగ్రెస్ ఆలోచన అదే విధంగా ఉందని విమర్శించారు. శామ్ పిట్రోడా భారతీయులను అరబ్బులుగా, చైనీయులుగా, ఆఫ్రికన్లుగా పోల్చడాన్ని సమర్థిస్తూ అధిర్ రంజన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని పూనావాలా దుయ్యబట్టారు. విదేశాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రపతిని, రాష్ట్రపత్ని అని సంభోదించిన అధిర్ రంజన్ చౌదరీని కాంగ్రెస్ పార్టీ బర్త్‌రఫ్ చేస్తుందా..? అని ఆయన ప్రశ్నించారు. చర్మరంగు ఆధారంగా మన దేశస్తులను విమర్శించడాన్ని దేశం సహించదని చెప్పారు.

Show comments